కేంద్రం తెచ్చిన నూతన వ్యవసాయ చట్టాలతో రైతులు పాలేర్లుగా మారుతారని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు పొన్నం ప్రభాకర్ ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల భారత్ బంద్‌కు మద్దతు తెలిపిన కేసీఆర్ దిల్లీకి వెళ్లి రాగానే యూటర్న్ ఎందుకు తీసుకున్నారని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులకు జవాబు చెప్పాలని డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో కేంద్ర రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలనే డిమాండ్‌తోపాటు పంట సేకరణపై కేసీఆర్ చేసిన ప్రకటనకు నిరసనగా రైతులు ర్యాలీ నిర్వహించారు.
అంబేద్కర్ చౌరస్తా నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు చేపట్టిన ర్యాలీలో కాంగ్రెస్ శ్రేణులతో కలిసి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. ఆర్డీవో కార్యాలయంలోకి ర్యాలీగా వెళుతుండగా పోలీసులు అడ్డుకోవడంతో.. పోలీసులకు, కాంగ్రెస్ కార్యకర్తలకు మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. అనంతరం పోలీసులు అనుమతి ఇవ్వడంతో తహసిల్దార్‌కు పొన్నం వినతి పత్రాన్ని సమర్పించారు.