తెలంగాణ, దుబ్బాకను మోసం చేసిన కేసీఆర్కు బుద్ధి చెప్పే సమయం వచ్చిందని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక ఉపఎన్నిక కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ దాఖలు హాజరైన ఉత్తమ్... రైతులకు లక్ష రూపాయల రుణమాఫీ, నిరుద్యోగులకు రూ.3 వేల భృతి రావాలంటే తెరాసను ఓడించాలని పిలుపునిచ్చారు. కాళేశ్వరం, మిషన్ భగీరథ పేరుతో రాష్ట్రాన్ని దోచుకున్నారని విమర్శించారు. ఎవరు డబ్బులు ఇచ్చినా తీసుకొని... చెరుకు శ్రీనివాస్ రెడ్డిని గెలిపించాలని కోరారు.
దుబ్బాక తీర్పు నాలుగు కోట్ల ప్రజల మార్పు కావాలని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. దుబ్బాక మీద, రామలింగారెడ్డి మీద ప్రేమ ఉంటే... మంత్రి పదవి ఎందుకు ఇవ్వలేదని కేసీఆర్ను ప్రశ్నించారు. మోదీ, కేసీఆర్ ఒకటేనని... ఆణిముత్యం లాంటి ముత్యంరెడ్డి కొడుకు శ్రీనివాస్ రెడ్డిని గెలిపించాలని కోరారు. ఇక్కడి ప్రజలకు ఏ సమస్య వచ్చినా అండగా ఉంటామన్నారు.