దళితున్ని ముఖ్యమంత్రి చేస్తానని కేసీఆర్ మాట తప్పారని మాజీమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు గీతారెడ్డి ఆరోపించారు. ఏడేళ్లుగా ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు ఖర్చు పెట్టకుండా కాలయాపన చేశారని మండిపడ్డారు. ఈనెల 17న సిద్దిపేట జిల్లా గజ్వేల్లో నిర్వహించునున్న గిరిజన, దళిత దండోరా ముగింపు సభ ఏర్పాట్లను షబ్బీర్ అలీ, దామోదర రాజనర్సింహతో కలిసి ఆమె పరిశీలించారు.
ఏడేళ్లుగా ఎస్సీలను పట్టించుకోని సీఎం కేసీఆర్ హుజూరాబాద్ ఉపఎన్నిక రాగానే దళితబంధును తీసుకొచ్చారని గీతారెడ్డి విమర్శించారు. కేవలం ఓట్ల కోసమే పథకాన్ని ప్రవేశపెట్టి మరోసారి మోసం చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉపాధి కల్పనలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. ఈ సభకు ముఖ్య అతిథిగా సీనియర్ నాయకులు మల్లిఖార్జున ఖర్గే రానున్నట్లు ఆమె వెల్లడించారు. దళితబంధు లాగే బడుగు, బలహీన వర్గాలను ప్రభుత్వం ఆదుకునే వరకు కాంగ్రెస్ పోరాడుతుందని కాంగ్రెస్ సీనియర్ నాయకులు షబ్బీర్ అలీ అన్నారు. సీఎం కేసీఆర్ను ప్రశ్నించేందుకు రాష్ట్ర నలుమూలల నుంచి ప్రజలందరూ సభకు రావాలని ఆయన పిలుపునిచ్చారు.