ఎన్నికల నియమావళిని పాటిస్తూ సజావుగా జరిగేలా చూడాలని ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులకు కలెక్టర్ భారతి హోళికేరి సూచించారు. ఎన్నికల ప్రక్రియ అంతా పీఓ, ఏపీఓలపైనే ఆధారపడి ఉందని కష్టపడి పనిచేసి జిల్లాకు మంచిపేరు తీసుకురావాలని కోరారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక ఉపఎన్నికలపై రెండో విడత శిక్షణ కార్యక్రమం మంగళవారం దుబ్బాక ఆదర్శ పాఠశాలలో జరిగింది.
ఈ శిక్షణ కార్యక్రమానికి కలెక్టర్‌తో పాటు జిల్లా ఎన్నికల అధికారి హాజరయ్యారు. తప్పనిసరిగా సమయపాలన పాటించాలని, ఈసారి ఎన్నికల్లో పాల్గొనే సిబ్బందికి రవాణా సదుపాయాలు కల్పిస్తామని పేర్కొన్నారు.
ఎన్నికల విధులను ఆత్మవిశ్వాసంతో, క్రమశిక్షణతో నిర్వహించాలని పీఓ, ఏపీఓలను కోరారు. వారి శిక్షణపై ఆరా తీశారు. పోలైన ఓట్ల వివరాలు ప్రతి ఏజెంట్‌కు పోలింగ్ అనంతరం తెలియజేయాలని సూచించారు. వివిధ రకాల నియమాలు 29A, 1951- ప్రజా ప్రాతినిధ్య చట్టం, 48MA, 480 నియమాలను వివరించారు.
ఈ కార్యక్రమంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి చెన్నయ్య, నోడల్ అధికారి జయచంద్రా రెడ్డి, శ్రవణ్ కుమార్, స్టేట్ లెవల్ మాస్టర్ ట్రైనర్స్ రమేశ్ రావు, డాక్టర్ అయోధ్య రెడ్డి, జిల్లా ట్రైనర్స్, పీఓ, ఏపీఓలు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:కేంద్ర బలగాలతో దుబ్బాక ఉప ఎన్నికలు నిర్వహించాలి: భాజపా