అయోధ్యలో రామమందిర నిర్మాణం కోసం ఈరోజు నుంచి ఫిబ్రవరి 10వ తేదీ వరకు విరాళాల సేకరణ జరుగుతుందని ట్రస్ట్ సభ్యులు వెల్లడించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో శోభాయాత్రను ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని స్థానిక రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి నిధి సేకరణ కార్యక్రమం చేపట్టారు.
హుస్నాబాద్‌లో రామమందిర నిర్మాణం కోసం విరాళాల సేకరణ
అయోధ్య రామమందిర నిర్మాణానికి విరాళాల సేకరణ కార్యక్రమం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో ఘనంగా నిర్వహించారు. భజరంగ్ దళ్, రామమందిర నిర్మాణ ట్రస్ట్ సభ్యులు పెద్దఎత్తున శోభాయాత్రలో పాల్గొన్నారు. సేకరించిన ప్రతి రూపాయిని అయోధ్యకు పంపిస్తామని వారు తెలిపారు.
శోభాయాత్రలో పాల్గొన్న ట్రస్ట్ సభ్యులు
ప్రతి ఇంటికి గడపగడపకు వెళ్లి నిధి సేకరణ ప్రాముఖ్యాన్ని ట్రస్ట్ సభ్యులు వివరించారు. ప్రతి విరాళం రూ.10 నుంచి అంతకు పైన విరాళాలు సేకరించిన రోజే ట్రస్ట్ బ్యాంకు ఖాతాలో జమ చేయడం జరుగుతుందన్నారు. మొదటిరోజే రూ.20 వేల విరాళాలు సేకరించడం జరిగిందని తెలిపారు. ప్రతి హిందువు నిధి సేకరణలో భాగస్వాములై స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడం తమ పూర్వ జన్మ సుకృతంగా భావిస్తున్నట్లు తెలిపారు.