సిద్దిపేట జిల్లా మర్కూక్ మండల కేంద్రంలోని కొండపోచమ్మ జలాశయం నుంచి సంగారెడ్డికి సాగునీరు అందించే కాలువ నీటి వంతెన కుప్పకూలి జలాశయంలో పడిపోయింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని మర్కూక్ మండలం పాములపర్తి శివారులో 15 టీఎంసీల సామర్ధ్యంతో కొండపోచమ్మ జలాశయాన్ని నిర్మించారు. నిప్రారంభించిన రెండేళ్లలోనే పనులను అధికారులు పూర్తి చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు అనుసంధానంగా నిర్మించిన కొండపోచమ్మ జలాశయం మే 29న ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా ప్రారంభించారు. ఎత్తిపోతల పథకం ద్వారా గోదావరి జలాలను ఈ జలాశయంలో నింపుతున్నారు. ఇప్పటివరకు ఏడు టీఎంసీలకు పైగా గోదావరి నీరు జలాశయంలో చేరింది కొండపోచమ్మ జలాశయం నుంచి ఎడమ కాలువ ద్వారా యాదాద్రి భువనగిరి జిల్లాకు సాగునీటిని అందించే విధంగా ఏర్పాటు చేశారు.
కూలిన కుడి కాలువ వంతెన
కుడి కాలువ ఉమ్మడి మెదక్ జిల్లాకు నీటిని అందించే విధంగా కాలువలు నిర్మించారు. ఈ వంతెన వద్ద నిర్మించిన జలాశయం కాల్వలో నుంచి నీరు వెళుతుంది. కుడి కాలువపైన సంగారెడ్డికి నీటిని అందించే కాలువకు నీటిని వదిలే విధంగా జలాశయం కట్టలో నుంచి వంతెన నిర్మించారు. ఈ వంతెన నుంచి నీటిని వదులుతారు. ఇదిలా ఉండగా శనివారం వంతెన కూలిపోయింది. విషయం తెలుసుకున్న అధికారులు, పోలీసులు జలాశయాన్ని చూసేందుకు వచ్చే పర్యాటకుల నిలిపివేశారు. భారీగా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేసి కూలిపోయిన వంతెన నిర్మాణ పనులు ప్రారంభించారు.