రాష్ట్రంలో ప్రతిష్టాత్మక శ్రీకొండా లక్ష్మణ్ ఉద్యాన విశ్వవిద్యాలయం, సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ప్రారంభోత్సవానికి రంగం సిద్ధమైంది. ఉద్యాన పంటల సాగు,విస్తీర్ణం, ఉత్పత్తి, ఉత్పాదకత పెంపొందించేందుకు అధిక ప్రాధాన్యత ఇస్తున్న దృష్ట్యా... సిద్ధిపేట జిల్లా ములుగులో కొలువు తీరిన ఉద్యాన విశ్వవిద్యాలయం, అనుబంధంగా అత్యుత్తమ పండ్ల పరిశోధన సంస్థ ప్రారంభం ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభోత్సవం కానున్నాయి. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. దేశంలో నాలుగో ఉద్యాన విశ్వవిద్యాలయంగా ములుగులో కొలువుదీరిన వర్శిటీ ప్రాముఖ్యత సంతరించుకుంది. హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు తర్వాత రాష్ట్రంలోనే ఉద్యాన విశ్వవిద్యాలయం ఏర్పాటైంది. మొత్తం 53 ఎకరాల విస్తీర్ణంలో 22 కోట్ల రూపాయల వ్యయంతో నూతన హార్టికల్చర్ వర్శిటీ నిర్మించారు. 30 ఎకరాల విస్తీర్ణంలో సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ఏర్పాటు చేసి పలు రకాల పండ్ల మొక్కలపై పరిశోధన చేయనున్నారు. మామిడి, జామ, దానిమ్మ, బొప్పాయి, చింత, ఉసిరి తదితర 49 రకాల పండ్ల మొక్కలతోపాటు చందనం, వెదురు మొక్కలు పెంచనున్నారు.
సమీకృత విపణులకు శ్రీకారం
గజ్వేల్ స్ఫూర్తిగా రాష్ట్రంలో సమీకృత విపణులకు శ్రీకారం చేపట్టిన ప్రభుత్వం... ఆరున్నర ఎకరాల విస్తీర్ణంలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణం చేపట్టింది. ఈ మార్కెట్‌ను ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. ఆరు బ్లాకుల్లో అన్ని రకాల కూరగాయలు, పండ్లు, మాంసాహారం లభించనున్నాయి. 16 వాణిజ్య దుకాణాలు, సూపర్ మార్కెట్, పిల్లలకు కోసం ఉద్యానవనం ఏర్పాటు వల్ల అహ్లాదకరంగా మార్కెట్ ప్రాంగణం దర్శనమిస్తోంది.
రైతులు ఆత్మగౌరవంతో బతకాలనే లక్ష్యంతో
రెండేళ్లుగా ఉద్యాన విశ్వవిద్యాలయం, సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ రూపుదిద్దేందుకు అధికారులు ఎంతో కృషి చేశారు. ఉద్యాన రంగంలో శాస్త్ర, సాంకేతికత పెంపొందించేందుకు ఇది దోహదపడనుంది. రైతుల ఆర్థికాభివృద్ధికి, సాంకేతిక శిక్షణకు కావాల్సిన సదుపాయాలన్నీ ఇక్కడ సమకూర్చారు. రైతు ఆత్మగౌరవంతో బతకాలి అనే సంకల్పంతో సాగు రంగంపై ప్రత్యేక దృష్టిసారించిన సర్కార్... ఉద్యానపంటల పరిశోధన, సాగు, విస్తీర్ణం, ఉత్పత్తి, ఉత్పాదతక పెంపొందిచేందుకు అనేక చర్యలు చేపట్టింది. పండ్ల తోటల సాగు, విస్తీర్ణం, దిగుబడుల పెంపు లక్ష్యంతో ఏర్పాటైన సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ నిధులతోనే నిర్మితమైంది.