కొత్త జిల్లాలో అత్యాధునిక హంగులతో నిర్మించిన కలెక్టరేట్ల ప్రారంభోత్సవాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR) సిద్దిపేట నుంచి మొదలుపెట్టనున్నారు. సిద్దిపేటలో ముఖ్యమంత్రి పర్యటన ఈ ఉదయం 11గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు కొనసాగనుంది. మొదటగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని.. అనంతరం పోలీస్ కమిషనర్ కార్యాలయాలను సీఎం ప్రారంభించనున్నారు. చివరగా సమీకృత కలెక్టర్ కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. అనంతరం ప్రజా ప్రతినిధులు, అధికారులతో కలెక్టరేట్‌లోనే కేసీఆర్ సమావేశం కానున్నారు.
ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో పోలీసులు పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. సిద్దిపేట సీపీతో పాటు సూర్యాపేట, వికారాబాద్‌ల ఎస్పీలు సైతం... సీఎం పర్యటన బందోబస్తులో పాల్గొంటున్నారు. వివిధ జిల్లాలకు చెందిన 1500మంది పోలీసు సిబ్బంది భద్రతా విధుల్లో పాల్గోనున్నారు. కేసీఆర్ పర్యటన ముగిసే వరకు.. రాజీవ్ రహదారితో పాటు సిద్దిపేటలో ట్రాఫిక్ అంక్షలు విధించారు. ప్రత్యామ్నాయ మార్గాల్లో వాహనాలను దారి మళ్లించనున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సిద్దిపేట పట్టణంలో పారిశుధ్య నిర్వహణ, పచ్చదనాన్ని పరిశీలించే అవకాశం ఉంది.