చిత్తశుద్ధి, వాక్‌శుద్ధి, లక్ష్యశుద్ధితో కృషి చేస్తున్నందునే దేశంలో నేడు తెలంగాణ ప్రత్యేక గుర్తింపు సాధిస్తోందని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాల్లో భాగంగా.... సిద్దిపేట, కామారెడ్డి జిల్లాల్లో ఆయన పర్యటించారు. హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ ద్వారా సిద్దిపేటకు చేరుకున్న సీఎం.. ముందుగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం... కొండపాక మండలం రాంపల్లి శివారులో నిర్మించిన పోలీస్ కమిషనరేట్ సముదాయాన్ని సీఎం ప్రారంభించి.... పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం సిద్దిపేట సమీకృత జిల్లా పాలనా కార్యాలయాల భవన సముదాయాల ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ వెంకట్రామిరెడ్డి, సీపీ జోయల్ డేవిస్‌ను వారి కుర్చీల్లో కూర్చోబెట్టి అభినందించారు.
ఉద్వేగానికి గురైన సీఎం
తాను పుట్టిపెరిగిన సిద్దిపేటలో తొలి కలెక్టరేట్ సముదాయం ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందంటూ ముఖ్యమంత్రి ఉద్వేగానికి గురయ్యారు. తెలంగాణ ఉద్యమం కూడా సిద్దిపేట నుంచే ప్రారంభమైందని.... నాటి రోజులను గుర్తుచేసుకున్నారు. ఒకప్పుడు కరెంటు, నీళ్ల కోసం ఎన్నో కష్టాలు పడ్డామని చెప్పారు. రాష్ట్రంలోని నాలుగు దిక్కుల్లో ఉండేలా సిద్దిపేట, నల్గొండ, నిజామాబాద్‌కు పశువైద్య కళాశాలలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. రైతుబంధు, రైతు బీమాలతో అన్నదాతలకు అండగా నిలుస్తున్నామన్న కేసీఆర్. గోదావరి జలాలు రాష్ట్రమంతా పారేలా కృషి చేస్తున్నట్లు చెప్పారు. ఎవరూ అడగకున్నా.... రైతుబంధు, బీమాతోపాటు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు తీసుకువచ్చినట్లు వివరించారు.