కలెక్టర్లతో సమావేశంలో భాగంగా రెండోరోజు సిద్దిపేట జిల్లాలో పర్యటించారు ముఖ్యమంత్రి కేసీఆర్. హరితహారం, మిషన్ భగీరథకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న సీఎం... గజ్వేల్ నియోజకవర్గంలోని ప్రగతిని అధికారులకు ప్రత్యక్షంగా చూపించారు. మంత్రులు, కలెక్టర్లతో కలిసి ప్రగతి భవన్ నుంచి బస్సుల్లో వచ్చిన కేసీఆర్... సింగాయిపల్లి, నేంటూరు, కోమటిబండ తదితర ప్రాంతాల్లో చేపట్టిన అటవీ పునరుద్ధరణ పనులను పరిశీలించారు. గజ్వేల్ అటవీప్రాంతంలో చేపట్టిన అడవుల పునరుద్ధరణ కార్యక్రమాన్ని అటవీశాఖ పీసీసీఎఫ్ ఆర్ శోభ, అడిషనల్ పీసీసీఎఫ్ డోబ్రియాల్ వివరించారు. అడవుల వల్ల ఉష్ణోగ్రతతో పాటు కాలుష్యం తగ్గుతుందని, జీవ వైవిద్యానికి అవకాశం కలుగుతుందని తెలిపారు. ఆయా జిల్లాల్లో అటవీభూముల్లో అడవుల పునరుద్ధరణకు అవసరమయ్యే కాంపా నిధులు అందుబాటులో ఉన్నాయని చెట్ల పెంపకానికి అవసరమైన చర్యలు అటవీశాఖ ద్వారా తీసుకుంటామని తెలిపారు.
సమగ్ర ప్రణాళికతోనే సాధ్యం...
సామాజిక అడవుల పెంపకం, ఆవాస ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గించడానికి ఉపయోగపడితే... అడవుల పెంపకం మొత్తం వాతావరణంలోనే మార్పు తెస్తుందని, వర్షాలు బాగా కురిసేలా జీవ వైవిధ్యానికి దోహద పడుతుందని సీఎం పేర్కొన్నారు. రాష్ట్రం ఏర్పడిన కొత్తలో తాను ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలోని అటవీభూములు చెట్లులేని ఎడారుల్లా ఉండేవని... సమగ్ర ప్రణాళికతో అటవీ సంపదను పెంపొందించుకున్నామన్నారు. మూడేళ్ల క్రితం ప్రారంభమైన పునరుద్ధరణ ఫలితాలు ఇప్పుడు కనిపిస్తున్నాయన్న సీఎం... ఈ ప్రాంతమంతా పచ్చని చెట్లతో కళకళలాడుతోందని... వర్షపాతమూ పెరిగిందన్నారు. 27 రకాల పండ్ల మొక్కల్ని పెంచడం వల్ల ఇవి మంకీ ఫుడ్ కోర్టుల్లా తయారవుతున్నాయని వెల్లడించారు. రాష్ట్రంలో 23.4శాతం అటవీ భూమి ఉన్నా... అదే నిష్పత్తిలో అడవులు లేవన్న సీఎం... గజ్వేల్ చుట్టుపక్కల ప్రాంతాల్లో చేపట్టిన అటవీ పునరుద్ధరణ కార్యక్రమాన్ని స్ఫూర్తిగా తీసుకొని అడవుల్ని కాపాడుకోవాలని...మొక్కలు నాటి అడవిని పునరుద్ధరించాలని మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లకు సూచించారు.