పేదల చిరకాల వాంఛ సొంత గూడు. మనదంటూ ఒక ఇల్లు ఉంటే ఎలాగైనా బతుకొచ్చనే ధీమా. పొద్దంతా కూలీ నాలి చేసుకుని వచ్చి తలదాచుకోవడానికి కాస్త చోటుంటే ఎంతో ధైర్యం. ప్రస్తుత పరిస్థితుల్లో పేదలు స్థలాల్ని కొనుక్కోవడమే గగనం. కానీ...ప్రభుత్వం వారి కలల్ని నెరవేరుస్తోంది. సంపన్నవర్గాల ఇళ్లను తలదన్నేలా రెండు పడక గదుల ఇళ్లను కట్టించి ఇస్తోంది. గేటెడ్ కమ్యూనిటీని తలపించేలా, అందమైన అపార్ట్‌మెంట్ల మాదిరిగా అత్యున్నత ప్రమాణాలతో గృహ సముదాయాల్ని నిర్మించింది. సకల సౌకర్యాలు , అన్ని హంగులతో పేదలకు ఇంటి భాగ్యం కల్పిస్తోంది.
సకల సౌకర్యాలతో..
45 ఎకరాల విస్తీర్ణంలో సుమారు 163 కోట్ల రూపాయలతో ప్రభుత్వం 2వేల 460 ఇండ్లను నిర్మించింది. 205 బ్లాక్‌లకు గాను ఒక్కో బ్లాక్‌లో 12 ఇండ్లు ఉన్నాయి. జీ+2 పద్ధతిలో నిర్మించిన భవనాలు ఎంతో ఆకట్టుకుంటున్నాయి. ప్రతి ఇంటికి 24 గంటల తాగునీరు, పైప్‌లైన్ ద్వారా గ్యాస్ కనెక్షన్, విద్యుత్ సదుపాయం, సమీకృత మార్కెట్ యార్డు, మల్టీ పర్పస్ ఫంక్షన్ హాల్, 6 లక్షల లీటర్ల సామర్థ్యం కలిగిన మిషన్ భగీరథ సంప్, పిల్లల ఆటస్థలం, పార్కు...ఇలా ప్రతి ఒక్క సదుపాయాన్ని కల్పించారు. పచ్చదనం పరుచుకునేలా గ్రీనరీ, అంతర్గత సీసీ రోడ్లు, భూగర్భ డ్రైనేజీని ఏర్పాటు చేశారు. పేదలకు ఇళ్లు ఇచ్చామా లేదా అన్నది కాకుండా... ఒక అధునాతన కాలనీలో ఉండే సదుపాయాలన్నీ ఇక్కడ అందుబాటులోకి తెచ్చారు.