కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా సిద్దిపేట జిల్లాలో నిర్మించిన అతిపెద్ద జలాశయం మల్లన్నసాగర్ ప్రాజెక్టును సీఎం కేసీఆర్ విహంగ వీక్షణం ద్వారా పరిశీలించారు. 50 టీఎంసీల సామర్థ్యంతో ఈ జలాశయం నిర్మాణమైంది. నిర్మాణ పనులన్నీ పూర్తి కావడంతో ఈ ఏడాది జలాశయాన్ని కాళేశ్వరం జలాలతో నింపాలని ప్రభుత్వం నిర్ణయించింది. గత ఆదివారం నుంచి ప్రయోగాత్మకంగా నీటిని జలాశయంలోనికి పంపుతున్నారు. ఆ దృశ్యాన్ని విహంగవీక్షణం ద్వారా చూసిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఆనందం వ్యక్తం చేశారు.
పల్లెలు, పట్టణాలకు మిషన్ భగీరథ పేరిట సాగుతున్న తాగునీటి సరఫరాకు సిద్దిపేట జిల్లాలో నిర్మించిన మల్లన్న సాగర్ జలాశయం గరిష్ఠస్థాయిలో తన సేవలందించనుంది. ఈ క్రమంలో 50 టీఎంసీల సామర్థ్యం గల ఈ జలాశయం నుంచి ఐదు జిల్లాలకు చెందిన 14 నియోజకవర్గాలతో బాటు హైదరాబాద్-సికింద్రాబాద్ జంట నగరాలకు తాగునీరందించేందుకు శాశ్వత ప్రాజెక్టు నిర్మాణ పనులు చేపట్టారు. ఇందుకోసం కొండపాక మండలం మంగోలు గ్రామం వద్ద ప్రాజెక్టు లోపల ఇన్‌టెక్ వెల్, వెలుపల నీటి శుద్ధి కేంద్రం, పైపులైను నిర్మాణాలకు రూ.1212 కోట్ల అంచనా వ్యయానికి ప్రభుత్వం అనుమతించి జీవో విడుదల చేసింది. ఈ క్రమంలో మంగోలులో 540 ఎంఎల్‌డీ సామర్థ్యంతో నీటి శుద్ధి (వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంటు) కేంద్ర నిర్మాణం యుద్ధప్రాతిపదికన సాగుతోంది. రానున్న 8 నెలల వ్యవధిలో అన్ని పనులు పూర్తి చేసి వేసవిలో ఎక్కడా తాగునీటి ఎద్దడి తలెత్తకుండా చూడాలని నిర్ణయించింది. ఇప్పటికే జలాశయం వద్ద ఇన్‌టేక్ వెల్ పనులు పూర్తవగా మిగిలినవి శరవేగంగా సాగుతున్నాయి.
ప్రస్తుతం ఫేజ్-1 పథకం ద్వారా ఎల్లంపల్లి నుంచి జలాలను చిన్నకోడూరు మండలం మల్లారం నీటి శుద్ధికేంద్రానికి చేర్చి అక్కడ శుద్ధి చేసిన తరువాత కొండపాకలోని పంప్‌హౌస్‌కు, అనంతరం శామీర్‌పేట మండలం ఘన్‌పూర్ వద్ద నిర్మించిన సంప్‌హౌస్‌కు భారీ గొట్టాల ద్వారా ప్రతిరోజూ 750 ఎల్‌ఎండీ (మిలియన్ లీటర్స్ ఫర్ డే) నీటిని తరలిస్తున్నారు. ఈ గొట్టాల నుంచి నీటిని మళ్లించడం మూలంగా హైదరాబాద్‌కు వెళ్లే ప్రవాహం తక్కువై సరఫరాకు ఇబ్బంది తలెత్తే ప్రమాదం ఉందని భావించిన సర్కారు సమస్య ఉత్పన్నం కాకముందే ప్రత్యామ్నాయ చర్యల్లో భాగంగా ఫేజ్-2 కింద శాశ్వత పైప్‌లైను నిర్మాణాన్ని గజ్వేల్ వరకూ చేపట్టింది. ప్రస్తుతం గజ్వేల్‌కు ఏడాదికి 0.9 టీఎంసీలు, హైదరాబాద్‌కు 10 టీఎంసీల నీటిని సరఫరా చేస్తున్నారు. పథకాన్ని నిరాటంకంగా కొనసాగించాలనే ఉద్దేశంతో మల్లన్న సాగర్ జలాశయం నుంచి ఏటా 30 టీఎంసీల నీటిని వినియోగించుకునేందుకు ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నట్లు మిషన్ భగీరథ డీఈ నాగార్జునరావు ధ్రువీకరించారు.