Mallanna sagar reservoir inauguration : కాళేశ్వరం ఎత్తిపోతలలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. తెలంగాణ జలకిరీటంగా భాసిల్లే మల్లన్నసాగర్ రిజర్వాయర్‌ను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రారంభించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా సిద్దిపేట జిల్లాలో నిర్మించిన మల్లన్నసాగర్‌ను సీఎం కేసీఆర్ జాతికి అంకింతం చేశారు. భారీ జలాశయంలోకి లాంఛనంగా నీటిని విడుదల చేశారు. విహంగవీక్షణం ద్వారా ప్రాజెక్టును పరిశీలించారు. మల్లన్నసాగర్ ప్రాజెక్టు వద్ద సీఎం కేసీఆర్ ప్రత్యేక పూజలు చేశారు. ఈ పూజల్లో మంత్రి హరీశ్‌రావు, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు.
ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు
కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలోని అన్ని జలాశయాల కంటే మల్లన్నసాగర్ అతి పెద్దది. అత్యంత ఎత్తున ఉన్న జలాశయంగా గుర్తింపు పొందింది. భారీ మట్టికట్టతో.... 50 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించారు. 11 కంపెనీలు మల్లన్నసాగర్ నిర్మాణంలో పాలుపంచుకున్నాయి. సుమారు 7వేల మంది కార్మికులు ప్రతి నిత్యం మూడు షిఫ్టుల్లో పని చేసి జలాశయం కలను సాకారం చేశారు. కొండపోచమ్మ, గంధమల, బస్వాపూర్ రిజర్వాయర్లకు మల్లన్నసాగర్ ద్వారానే నీటిని పంపుతారు. నిజాంసాగర్, సింగూరు, ఘనపూర్ ఆయకట్టు స్థిరీకరణ కూడా ఈ జలాశయంపైనే ఆధారపడి ఉంది. డ్యామ్ ప్రొటోకాల్‌ను అనుసరించి ఇప్పటికే నీటి నిల్వ సామర్థ్య పరీక్షలు విజయవంతమయ్యాయి. ఈ జలాశయం ద్వారా 15 లక్షల 71 వేల 50 ఎకరాలకు సాగు నీరు అందనుంది. హైదరాబాద్ ప్రజలకు తాగునీరు కోసం 30 టీఎంసీలు భవిష్యత్తులో సరఫరా చేయనున్నారు. పారిశ్రామిక అవసరాలకు ఈ ప్రాజెక్టు నుంచే జలాలు అందనున్నాయి.