తన మీద అభిమానం చూపిన వారిని ముఖ్యమంత్రి కేసీఆర్ (Cm Kcr) ఆశ్చర్యానికి గురి చేశారు. ఈరోజు కేసీఆర్ ఎర్రవల్లిలోని తన వ్యవసాయ క్షేత్రం నుంచి వాసాలమర్రికి వెళ్లే సమయంలో మార్గంలోని మర్కుక్ మండలం కాశిరెడ్డిపల్లి (Kashi reddy pally) గ్రామస్థులు రోడ్డుపై నిలబడి వాహన శ్రేణిపై పువ్వుల వర్షం కురిపించారు. తిరిగి వచ్చే సమయంలోనూ గ్రామస్థులు పువ్వుల వర్షం కురిపించగా... సీఎం కేసీఆర్ తన వాహనం దిగి గ్రామస్థులతో మాట్లాడారు.
వారి బాగోగులు, వ్యవసాయానికి సంబంధించిన అంశాలు అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల గురించి గ్రామస్థులు సీఎంకు వినతి పత్రం అందించారు. దానిని చదివిన సీఎం కేసీఆర్... ఈనెల 10 తర్వాత ఎర్రవల్లిలోని తన వ్యవసాయ క్షేత్రానికి రావాల్సిందిగా గ్రామ పెద్దలను ఆహ్వానించారు. ఆరోజు భోజనం చేసిన తర్వాత గ్రామంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై చర్చిద్దామని వారికి సూచించారు.