CM KCR Election Campaign in Gajwel :దేశంలోనేగజ్వేల్ ఒక రోల్ మోడల్‌గా ఎదిగిందని బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో సీఎం కేసీఆర్ తన చివరి ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇతర రాష్ట్రాల నేతలు గజ్వేల్ అభివృద్ధి చూడడానికి తండోపతండాలుగా వచ్చారన్నారు. మిషన్ భగీరథ గురించి తెలుసుకునేందుకు భారీగా తరలివచ్చారని చెప్పారు. అన్ని రాష్ట్రాల నుంచి వచ్చి కోమటిబండ అభివృద్ధి చూశారని గుర్తుచేశారు. ఈ ఎన్నికల్లో ఇదే తనకు చివరి సభ అని వివరించారు.
CM KCR Speech at Gajwel BRS Public Meeting : గజ్వేల్‌లో తాను మాట్లాడేది 96వ సభ అని కేసీఆర్ వివరించారు. గజ్వేల్ నుంచి అవకాశం ఇచ్చి రాష్ట్రానికి సీఎం చేసి పంపారని సూచించారు. రాష్ట్రం కోసం ఎంతో కష్టపడి చాలా సాధించుకున్నామని సీఎం పేర్కొన్నారు. గజ్వేల్ మీదుగానే ఆర్‌ఆర్‌ఆర్ రాబోతోందని స్పష్టం చేశారు. 24 ఏళ్లుగా తెలంగాణ ఆశగా, శ్వాసగా బతుకుతున్నానని గజ్వేలు ప్రజలకు చెప్పారు. ప్రభుత్వాన్ని కూలగొట్టాలని సమైక్యవాదులు కుట్ర చేశారని ఆరోపించారు. మన ఎమ్మెల్యేలను కొనాలని ప్రయత్నం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విధివంచితుల కోసమే పింఛన్లు తీసుకువచ్చామని అన్నారు.
బీఆర్ఎస్ నేతలు దిల్లీ గులాములు కాదు - మాకు ప్రజలే బాసులు : కేసీఆర్
CM KCR at Gajwel BRS Public Meeting :రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం మళ్లీ వస్తే పింఛన్లను రూ.5 వేలకు పెంచుతామని సీఎం కేసీఆర్ హమీ ఇచ్చారు. రైతుబంధు సృష్టించి రైతులను ఆదుకున్నది కేసీఆర్ ప్రభుత్వమేనని గుర్తుచేశారు. 7500 కొనుగోలు కేంద్రాల ద్వారా రైతుల ధాన్యం సేకరిస్తున్నామని స్పష్టం చేశారు. భూములపై ప్రభుత్వం వద్ద ఉన్న అధికారాన్ని రైతులకు ధారపోశామని వివరించారు. రైతుల భూములను మార్చే అధికారం సీఎంకు కూడా లేదని చెప్పారు. ప్రతిపక్షాలు రైతుబంధు దుబారా చేస్తున్నట్లు విమర్శిస్తున్నారని సీఎం కేసీఆర్ విరుచుకుపడ్డారు.
రైతులకు 24 గంటల విద్యుత్ కావాలంటే మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం రావాలని సీఎం కేసీఆర్ ప్రజలకు సూచించారు. పదేళ్లుగా దేవుడి దయతో కరవు లేదని.. వర్షాలు పడుతున్నాయని పేర్కొన్నారు. విద్యారంగాన్ని అభివృద్ధి చేసుకున్నామని.. జిల్లాకో వైద్య కళాశాలల ఏర్పాటు చేసుకున్నామని సీఎం స్పష్టం చేశారు. తెలంగాణ ఆచరిస్తుంది.. దేశం అనుసరిస్తుందని చెప్పారు. సాధించిన రాష్ట్రాన్ని ఒక దరికి తెచ్చుకున్నామన్నారు. తెలంగాణ అద్భుత రాష్ట్రంగా మారాలని సూచించారు.