CM KCR Visits Siddipet Today: ముఖ్యమంత్రి కేసీఆర్, పంజాబ్ సీఎం భగవంత్‌సింగ్ మాన్ నేడు సిద్దిపేట జిల్లాలో పర్యటించనున్నారు. గజ్వేల్ నియోజకవర్గంలో చేపట్టిన పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను కేసీఆర్ భగవంత్‌సింగ్, ఆయన బృందానికి వివరించనున్నారు. ఈ క్రమంలోనే కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా మర్కూక్‌లో నిర్మించిన కొండపోచమ్మ సాగర్‌ను మొదట సందర్శించనున్నారు. అనంతరం అక్కడి నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ దత్తత గ్రామాలు ఎర్రవల్లి, నర్సన్నపేట గ్రామాల మధ్య ప్రవహించే కూడవెళ్లి వాగుపై నిర్మించిన చెక్‌డ్యాంలు పరిశీలిస్తారు. అక్కడి నుంచి ఇద్దరూ కలిసి గజ్వేల్ పట్టణంలోని పాండవుల చెరువును సందర్శిస్తారు. పాండవుల చెరువు వద్ద రైతులు, సంక్షేమ పథకాల లబ్ధిదారులతో ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశం కానున్నారు.
CM KCR and Punjab CM Visit Siddipet Today: రాష్ట్రంలో భూగర్భ జలాల పరిరక్షణ చర్యలను అధ్యయనం చేసేందుకు పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్‌సింగ్ మాన్ నేతృత్వంలోని బృందం బుధవారం రాత్రి రాష్ట్రానికి వచ్చింది. ఆయనతో పాటు ఆ రాష్ట్ర నీటి పారుదల శాఖ కార్యదర్శి, చీఫ్ ఇంజినీర్లు కూడా వచ్చారు. రాష్ట్రంలో భూగర్భ జలాల పరిరక్షణకు గత కొన్నేళ్లుగా చేపట్టిన చర్యలను పంజాబ్ సీఎం, అధికారులు పరిశీలించనున్నారు. మిషన్ కాకతీయ కింద చెరువుల పునరుద్ధరణ, చెక్‌డ్యాంల నిర్మాణం తదితరాలు, వాటి ఫలితాలను క్షేత్రస్థాయిలో అధ్యయనం చేయనున్నారు.