తెలంగాణ

telangana

ETV Bharat / state

పేదోళ్ల వంటింట్లో పైపు తిప్పితే గ్యాస్‌ - Details of double bedroom houses in Telangana

సిద్దిపేటలో సకల హంగులతో రెండు పడక గదుల ఇళ్లు సిద్ధమయ్యాయి. వంటింట్లో పైపు తిప్పితే గ్యాస్‌ వస్తుంది. నల్లా లెక్కనే గ్యాస్‌ పైప్‌లైన్‌ ఏర్పాటు చేశారు. ఇది తొలిసారిగా సిద్దిపేటలో అందుబాటులోకి రానుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ రేపు ప్రారంభించనున్నారు.

Chief Minister KCR will inaugurate two-bedroom houses in Siddipet tomorrow
పేదోళ్ల వంటింట్లో పైపు తిప్పితే గ్యాస్‌

By

Published : Dec 9, 2020, 6:54 AM IST

సిద్దపేటలో పేదలకిచ్చే ఇళ్లను అన్ని రకాల హంగులతో తీర్చిదిద్దారు. నల్లా తిప్పితే నీళ్లు వచ్చినట్లుగానే... పైపు తిప్పితే గ్యాస్‌ వస్తుంది. పట్టణంలోని నర్సాపూర్‌లో నిర్మించిన రెండు పడక గదుల ఇళ్ల ప్రత్యేకత ఇది. 2,460 మంది లబ్ధిదారులకు ఇచ్చేలా ఇక్కడ జీ+2గా వీటిని నిర్మించారు. సమీకృత మార్కెట్‌, మల్టీ పర్పస్‌ ఫంక్షన్‌ హాల్‌, మురుగు శుద్ధి కేంద్రం, భూగర్భ మురుగు పారుదల వ్యవస్థ... ఇలా ఒక అధునాతన కాలనీలో ఉండే సదుపాయాలన్నీ అందుబాటులోకి తెచ్చారు. ఇందుకు రూ.163 కోట్లు వెచ్చించారు. పేదలకు పంపిణీ చేసే ఇళ్లలో పైపు ద్వారా గ్యాస్‌ సరఫరా చేయనుండటం ఇక్కడే ప్రథమం. రాష్ట్రంలోనే తొలి కీర్తిగా ఇది మిగులుతుందని మంత్రి హరీశ్‌రావు చెబుతున్నారు.

టొరెంట్‌ కంపెనీకి బాధ్యత

ఇక్కడ ఉన్న అన్ని ఇళ్లకు పైపుల ద్వారా గ్యాస్‌ సరఫరా చేసేందుకు టొరెంట్‌ కంపెనీకి బాధ్యత అప్పగించారు. ఇప్పటికే వీరు ప్రతి ఇంటికీ పైపులు అమర్చారు. ఈ భవనాల సముదాయంలోనే డీఆర్‌ఎస్‌ (డిస్ట్రిబ్యూటింగ్‌ రెగ్యులేటరీ సిస్టం) స్టేషన్‌నూ ఏర్పాటు చేస్తున్నారు. రెండు నెలలకోసారి బిల్లు చెల్లించాల్సి ఉంటుంది. మీటర్ల ద్వారా వినియోగాన్ని లెక్కకడతారు. ఈ విధానం వల్ల సిలిండర్‌ ద్వారా వాడుతున్న గ్యాస్‌ కంటే 15 నుంచి 20 శాతం వరకు ఆదా అవుతుందని సంస్థ ప్రతినిధి ఒకరు వివరించారు. వచ్చే జనవరిలోపు సిద్దిపేట పట్టణంలోని ఇళ్లకూ పైపుల ద్వారా గ్యాస్‌ పంపిణీ చేసేలా పనులు కొనసాగుతున్నాయి.

తొమ్మిదో బ్లాక్‌.. మూడో నంబరు ఇల్లు

సీఎం కేసీఆర్‌ ఈనెల 10న సిద్దిపేటలో రెండు పడక గదుల ఇళ్లను ప్రారంభిస్తారు. మొత్తం 144 మంది గృహప్రవేశాలు చేసేందుకు అంతా సిద్ధం చేశారు. తొమ్మిదో బ్లాక్‌లోని మూడో నంబరు నివాసానికి వెళ్లి సీఎం కేసీఆర్‌ గృహ ప్రవేశాలను ప్రారంభిస్తారు. 144 మందికీ పట్టాలతో పాటు కొత్త దుస్తులు, ఇతర సామగ్రినీ మంత్రి హరీశ్‌రావు మంగళవారం అందించారు.

పలు పద్ధతుల్లో సమాచారాన్ని వడబోసి..

ఇక్కడ నిర్మించిన రెండు పడక గదుల ఇళ్లకు 11 వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. వాహన, ఇంటి రిజిస్ట్రేషన్లు, ఆస్తి పన్ను చెల్లింపులు.. ఇలా రకరకాల పద్ధతుల్లో దరఖాస్తుదారుల వివరాలను విశ్లేషించారు. అలా ఒక జాబితా రూపొందించారు. వాటినీ ప్రదర్శించారు. అభ్యంతరాలు తెలపాలని కోరారు. అలా ఇప్పటి వరకు 1,354 మంది లబ్ధిదారులను తేల్చారు. మిగతా దరఖాస్తులు చివరి దశలో ఉన్నాయి. ఇళ్లను కేటాయించిన తర్వాత నిర్వహణ సమస్యలు తలెత్తకుండా కమిటీలను ఏర్పాటు చేయనున్నారు.

ABOUT THE AUTHOR

...view details