హిందువులకు దేశ వ్యాప్తంగా ఎంతో ప్రాశస్త్యంతో కూడిన ఆలయాలు అనేకం ఉన్నాయి. ఆర్థిక, శారీరక, ఆరోగ్య పరమైన కారణాలతో కొన్ని ఆలయాలకు వెళ్లడం అందరి వల్ల కాదు. కానీ ఆసక్తి ఉన్న వారందరికీ ఆ ఆలయాలు సందర్శించిన అనుభూతి కలిగించాలన్న ఉద్దేశంతో కొంతమంది భక్తులు.. ఆర్థిక మంత్రి హరీశ్ రావు అధ్యక్షతన.. సిద్దిపేట ధార్మిక ఉత్సవ సమితిని ఏర్పాటు చేశారు. ఈ సమితి ఆధ్వర్యంలో ప్రతి ఏటా శివరాత్రి సందర్భంగా సిద్దిపేటలో వివిధ మహిమాన్విత ఆలయాల నమూనాలు ఏర్పాటు చేస్తున్నారు. గత సంవత్సరం అమర్నాథ్ చేయగా.. ఈ సంవత్సరం ఛార్ దామ్ దర్శినిని ఏర్పాటు చేశారు.
ఛార్‌దామ్ యాత్ర నమూనా
ఆర్థికంగా, శారీరకంగా వ్యయప్రయాసలతో కూడిన ఛార్ దామ్ యాత్ర అనుకున్నంత సులువు కాదు. గడ్డకట్టుపోయే చలిలో ఈ యాత్ర చేయడం అందరి వల్ల కాదు. సిద్దిపేట ధార్మిక ఉత్సవ సమితి ఆధ్వర్యంలో సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో.. పశ్చిమ బెంగాల్ కు చెందిన కళాకారులతో మంచుకొండలు, ఆలయాల భారీ సెట్టింగులు నిర్మిస్తున్నారు. 200మంది కళాకారులు మూడు షిప్టుల్లో పని చేస్తూ నమూనాలు తీర్చిదిద్దుతున్నారు.
ద్వాదశ జ్యోతిర్లింగాలు
ఛార్ ధామ్ యాత్రలో భాగంగా ఉండే యమునోత్రి, గంగోత్రి, కేధారినాథ్, బద్రినాథ్ ఆలయాలను ఏర్పాటు చేస్తున్నారు. భక్తులకు అసలైన యాత్ర చేసిన అనుభూతి కలిగేలా మంచుకొండలను సైతం ఏర్పాట్లు చేస్తున్నారు. వీటితో పాటు దేశం నలుమూలల విస్తరించి ఉన్న ద్వాదశ జ్యోతిర్లింగాలను సైతం ఏర్పాటు చేస్తున్నారు. పదో తేది నుంచి 12తేది వరకు ఈ ఉత్సవాలు జరగనున్నాయి.