Chada Venkat Reddy Comments on Narendra Modi: దేశానికి నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయిన తర్వాత .. ఆర్ఎస్ఎస్, బీజేపీ కనుసన్నల్లో కేంద్ర ప్రభుత్వం నడుస్తోందని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి ఆరోపించారు. ప్రతిపక్షాలు లేని ప్రజాస్వామ్యాన్ని మోదీ సర్కార్ నడిపిస్తోందని విమర్శించారు. దేశవ్యాప్తంగా మొత్తం 9 రాష్ట్రాల్లోని ప్రభుత్వాలను బీజేపీ పడగొట్టిందని చెప్పారు. కేంద్రం ప్రశ్నించే వారిపై సీబీఐ, ఈడీ, ఐటీ వంటి దర్యాప్తు సంస్థలతో.. దాడులు చేయిస్తున్నారని దుయ్యబట్టారు. సిద్దిపేట జిల్లాలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ప్రస్తుత కాలం రాజకీయాల్లోకి ఆర్థిక నేర చరిత్ర కలిగిన వారు.. రాజకీయ భక్షకులు వస్తున్నారన్నారని చాడ వెంకట్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ప్రధానమంత్రిగా మోదీ అయిన తర్వాత ఎక్కువగా కుంభకోణాలు పెరిగిపోయానని తెలిపారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేసి.. కార్పోరేటర్లకు పట్టం కట్టాలని బీజేపీ ప్రభుత్వం చూస్తోందని విమర్శిచారు. ప్రపంచ కుబేరుడిగా పేరుపొందిన గౌతమ్ అదానీ.. నరేంద్ర మోదీ వల్లే రూ. 13లక్షల కోట్ల కుంభకోణం జరిగిందన్నారు. హిడెన్‌బర్గ్ నివేదికతో ఒక్కసారిగా అదానీ చేసిన భారీ ఆర్థిక మోసం బయటపడిందని.. ఇంత జరిగిన ఈ విషయంపై కేంద్రం ఎందుకు నోరుమెదపడం లేదని ప్రశ్నించారు.