మల్లన్నసాగర్ జలాశయం నుంచి భవిష్యతులో సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్, జనగాం నియోజకవర్గాలకు తాగునీరు అందించనున్నట్లు రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్‌రావు తెలిపారు. ఇందుకుగాను నాబార్డు ద్వారా రూ.324 కోట్లు మంజూరు చేయించామన్నారు. సిద్దిపేట పురపాలిక 2020-21 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ సమావేశం జరిగింది. బడ్జెట్‌కు పాలకవర్గం ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది.
ప్రస్తుతం సిద్దిపేట పురపాలికలో నీరు సరఫరా చేయడానికి వివిధ రూపాల్లో నెలకు రూ.కోటి ఖర్చు అవుతోందని మంత్రి అన్నారు. కరీంనగర్ జిల్లా దిగువమానేరు, గోదావరి సుజలస్రవంతి నుంచి నీటిని ట్యాపింగ్ చేయడం వల్ల భారీగా విద్యుత్తు బిల్లు వస్తోందని హరీశ్ రావు పేర్కొన్నారు. కుళాయి రుసుం రూపంలో నెలకు రూ.20 లక్షల ఆదాయం వస్తోందని.. ఈ అంతరంతో సాధారణ నిధులతో పనులు చేపట్టలేని స్థితి నెలకొందని వివరించారు.