ఇన్ని రోజులు దుబ్బాక నియోజకవర్గానికి రాని తెరాస మంత్రులు, ఎమ్మెల్యేలు.. ఎన్నిక వచ్చాక ఇంటింటికి తిరుగుతున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాకలో పర్యటించిన సంజయ్.. ఎంత మంది ప్రచారం చేసినా.. దుబ్బాకలో భాజపా జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. తెరాస ఎన్ని డబ్బులిచ్చినా తీసుకోండి కానీ.. ఓటు మాత్రం భాజపాకే వేయండని ప్రజలను కోరారు. ఎన్నికల ప్రచారానికి వస్తున్న మంత్రులను.. నియోజకవర్గానికి ఎన్ని నిధులు కేటాయించారో నిలదీయాలని సూచించారు.
ఎంత మంది అభ్యర్థులున్నా.. దుబ్బాకలో గెలిచేది భాజపాయే: బండి సంజయ్ - bjp telangana state president
తెరాస ప్రభుత్వం చేస్తున్న అవినీతికి సంబంధించి.. దుబ్బాక భాజపా అభ్యర్థి రఘునందన్ రావుకు పూర్తి అవగాహన ఉందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. దుబ్బాక ఎమ్మెల్యేగా గెలిస్తే రాజాసింగ్‌తో పాటు రఘునందన్ కూడా తెరాస సర్కార్ అక్రమాలను నిలదీస్తారని తెలిపారు.
దుబ్బాక భాజపా అభ్యర్థి రఘునందన్ రావు
దుబ్బాక నియోజకవర్గంలో తెరాస సర్కార్ అమలు చేస్తున్న ప్రతి పథకంలో వినియోగిస్తున్న నిధులు.. కేంద్రం నుంచి వచ్చినవేనని బండి సంజయ్ అన్నారు. దుబ్బాక నిధులపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.