సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం అచ్చుమయపల్లిలో భాజపా రాష్ట్ర కార్యదర్శి, దుబ్బాక ఇంఛార్జి మాధవనేని రఘునందన్‌రావు పర్యటించారు. భాజపా కార్యకర్తల సమక్షంలో పార్టీ జెండా ఆవిష్కరించి దుబ్బాక ఉపఎన్నిక ప్రచారం ప్రారంభించారు.
'దుబ్బాకలో మంత్రి హరీశ్ పర్యటన.. ఎన్నికల స్టంటే' - dubbaka constituency by election in Telangana 2020
ఉపఎన్నికలో అధికారం చేజిక్కించుకోవాలనే ఉద్దేశంతో మంత్రి హరీశ్ రావు తరచూ దుబ్బాకలో పర్యటిస్తున్నారని భాజపా రాష్ట్ర కార్యదర్శి, దుబ్బాక ఇంఛార్జి మాధవనేని రఘునందన్‌రావు అన్నారు. ప్రజలకు ఆశ చూపించడానికే ఈ పర్యటనలని మండిపడ్డారు.
రాష్ట్ర మంత్రి హరీశ్ రావు.. దుబ్బాక ప్రజలకు నెలరోజుల్లో డబుల్బెడ్రూం ఇవ్వాలని చెప్పడం, పింఛన్ రానివాళ్ల పింఛన్లు ఇవ్వాలని సంబంధిత అధికారులను ఆదేశించడం ఉపఎన్నిక దగ్గర పడుతున్నందుకేనని రఘునందన్ రావు అన్నారు. ఎన్నికలో గెలవడానికే దుబ్బాక ప్రజలను ఆశ పెడుతున్నారని ఆరోపించారు.
మంత్రి నిజంగా దుబ్బాక అభివృద్ధి కోరుకుంటే.. సిద్దిపేట మాదిరి.. దుబ్బాకలోనూ నాణ్యమైన రెండు పడక గదుల ఇళ్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. అచ్చుమయపల్లెలో కాల్వల కారణంగా నష్టపోతున్న రైతులకు తక్కువ పరిహారం ఇస్తూ తెలంగాణ సర్కార్ తీరని అన్యాయం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సిద్దిపేటలో ఒక రేటు.. మల్లన్న ముంపు గ్రామాలకు ఒకరేటు ఎందుకు ఇస్తున్నారని మంత్రి హరీశ్ రావును భాజపా రాష్ట్ర కార్యదర్శి రఘునందన్ రావు ప్రశ్నించారు.