సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పురపాలికలో జరుగుతున్న సీసీ రోడ్ల నిర్మాణ పనులను భాజపా నాయకులు పరిశీలించారు. సీసీ రోడ్ల నిర్మాణాలకు రూ.20 కోట్లు కేటాయిస్తే నాణ్యత ప్రమాణాలను గాలికొదిలేశారని పట్టణ భాజపా అధ్యక్షుడు శంకర్ బాబు ఆరోపించారు. పట్టణంలోని 15వ వార్డులో సీసీ రహదారి నిర్మాణ పనుల్లో నాణ్యతపై ఆరా తీశారు. ఇసుక దొరకడం లేదనే సాకుతో డస్ట్ వాడటం వల్ల కొద్దిరోజులకే రోడ్లు పగుళ్లు వస్తున్నాయని విమర్శించారు.
'సీసీ రోడ్ల నిధులు దుర్వినియోగం చేస్తున్నారు' - సీసీ రోడ్లు నిర్మాణాల్లో అవకతవకలపై హుస్నాబాద్‌లో భాజపా నాయకుల విమర్శలు
సీసీ రోడ్ల నిర్మాణాలు నాసిరకంగా చేపడుతున్నారని భాజపా నాయకులు విమర్శించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో జరుగుతున్న పనులను వారు పరిశీలించారు. అధికారులు, గుత్తేదారులు కుమ్మక్కై నిధులను దుర్వినియోగం చేస్తున్నారని భాజపా పట్టణ అధ్యక్షుడు శంకర్‌బాబు ఆరోపించారు.
అధికారులు, గుత్తేదారులు కుమ్మక్కై కోట్ల రూపాయల నిధులను దుర్వినియోగం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. కాంట్రాక్టర్లు మున్సిపల్ వాహనాలను వినియోగిస్తున్నా కూడా కమిషనర్ ఎందుకు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అభివృద్ధి పేరుతో 35 లారీల ఇసుకను సిమెంట్ రోడ్లకు వినియోగిస్తామని చెప్పి, ప్రైవేటు వ్యక్తులకు అమ్ముకుంటున్నారని ఆరోపించారు.
గతంలో మిషన్ భగీరథ ద్వారా రోడ్ల మరమ్మతులకు రూ.12 లక్షలు కేటాయిస్తే ఏలాంటి పనులు చేయకుండానే కాంట్రాక్టర్లు బిల్లులు తీసుకోవడం జరిగిందన్నారు. ప్రస్తుత పాలకవర్గం అండదండలతో జరుగుతున్న పనులపై విచారణ జరిపించి గుత్తేదారులు, ఏఈపై చర్యలు తీసుకోవాలని శంకర్ బాబు డిమాండ్ చేశారు. లేని పక్షంలో మున్సిపల్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపడుతామని హెచ్చరించారు.