సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని పట్టణ భాజపా నాయకులు పరిశీలించారు. కరోనా కష్టకాలంలో నిరుపేదలకు రేషన్ బియ్యం అందిస్తున్నట్లు పేర్కొన్నారు. కుటుంబంలోని ఒక్కొక్కరికి 15 కిలోల బియ్యం ఇస్తుండగా అందులో కేంద్ర ప్రభుత్వం 10 కిలోలు అందిస్తోందని తెలుపుతూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ యోజన పథకం కింద ఉచితంగా పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. రేషన్ కార్డుదారులకు ఒక్కొక్కరికి 5 కిలోల బియ్యం అందించాలని నిర్ణయించగా... రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంతో గత నెలలో పంపిణీ జరగలేదని భాజపా హుస్నాబాద్ అధ్యక్షుడు శంకర్‌బాబు తెలిపారు. మే, జూన్, జులై నెలలకు కలిపి ఒకే సారి 15 కిలోల బియ్యం పంపిణీ జరుగుతోందని వెల్లడించారు.
‘ఉచితంగా ఇస్తున్న 15 కిలోల బియ్యంలో 10 కిలోలు కేంద్రానివే’
కరోనా విపత్తు సమయంలో రేషన్ బియ్యం ఉచితంగా అందిస్తున్నారు. నిరుపేదలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బియ్యాన్ని పంపిణీ చేయడం పట్ల లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 15 కిలోల బియ్యంలో 10 కిలోలు కేంద్ర ప్రభుత్వమే పంపిణీ చేస్తోందని భాజపా నాయకులు తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్న వాటాను ప్రజలకు తెలియజేయకుండా తెలంగాణ ప్రభుత్వం మభ్య పెడుతోందని విమర్శించారు. రాష్ట్ర సర్కారు ఇంతకుముందు ఇచ్చిన 6 కిలోల బియ్యంలో ఒక కిలో తగ్గించి ప్రస్తుతం 5 కిలోలే ఇవ్వడం పట్ల అసహనం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం ఎలాంటి పక్షపాతం లేకుండా రాష్ట్రానికి నిధులు కేటాయిస్తున్నా... నాయకులు అబద్ధాలు చెబుతున్నారని ఆరోపించారు. మరోవైపు కరోనా విపత్తు వేళ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బియ్యం ఉచితంగా అందించడం పట్ల లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చదవండి:'ఈ నెల 10లోపు ధరణిలో చేరిన రైతులకు నగదు జమ'