సముద్రాలు, నదుల్లో చేపలు పట్టేందుకు పెద్ద బోట్‌లు అందుబాటులోకి ఉంటాయి. అయితే చెరువులు, వాగుల్లో చేపలు పట్టడం కొంత కష్టమైన పనే. చిన్న తెప్పలు అందుబాటులో ఉన్నా... వీటితో ప్రమాదాలు వెంటాడుతుంటాయి. ఈ ఇబ్బందులు తొలగించేందుకు సిద్దిపేట జిల్లా కోహెడకు చెందిన శంకర్ బైక్ బోట్‌ను తయారుచేశాడు. పంక్చర్ దుకాణం నడిపించే ఈయన... తన ఆలోచనకు నైపుణ్యాన్ని జోడించాడు. మత్స్యకారులు సులువుగా చేపలు పట్టేందుకు అనుకూలంగా ఉండే బోటును తయారు చేశాడు.
పాత సుజుకి బైక్ ఇంజిన్, టీవీఎస్ బైక్ హ్యాండిల్, థర్మాకోల్ షీట్‌లతో సొంతంగా తయారుచేసిన ఫ్యాన్ రెక్కలతో 8 నెలల క్రితమే బోటును సిద్ధంచేశాడు. అయితే బాడుగుల చెరువులో ప్రయోగాత్మకంగా నడిపించగా... కొన్ని లోపాలతో ప్రయత్నం విఫలమైంది. అయినప్పటికీ వెనక్కి తగ్గని శంకర్ కొన్ని మార్పులు చేసి మళ్లీ బోటును సిద్ధం చేశాడు. ప్రస్తుతం చెరువులో ప్రయోగాత్మకంగా బోటు పరుగులు తీస్తోంది. 20 నుంచి 25 వేల రూపాయల ఖర్చుతో బోటును తయారు చేశానని... ప్రభుత్వం సహకరిస్తే మత్స్యకారులకు అందిస్తానని శంకర్ చెబుతున్నాడు.