Best Tourism Village Chandlapur 2023 in Siddipet District : చుట్టూ పచ్చటి పంట పొలాలు.. ఆహ్లాదకరమైన వాతావరణం.. ద్వీపాన్ని తలపించే సాగరం.. అడుగడుగునా హరిత సంపద.. గుట్టపై రంగనాయకుడు.. ఇలా ఎన్నో విశేషాల సమాహారమే సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం చంద్లాపూర్ గ్రామం. పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న ఈ పల్లె.. జాతీయ స్థాయిలో మెరిసింది. ఈ ప్రాంత ఖ్యాతిని నలుదిశలా చాటింది. కేంద్రం ప్రకటించిన ఉత్తమ పర్యాటక గ్రామాల్లో రాష్ట్రం నుంచి జనగామ జిల్లాలోని పెంబర్తితో పాటు చంద్లాపూర్ ఎంపికయ్యాయి. ఈ మేరకు రేపు ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకొని కేంద్ర పర్యాటక మంత్రిత్వశాఖ నేతృత్వంలో దిల్లీలో జరిగే కార్యక్రమానికి ఆహ్వానం అందింది.
Best Tourism Villages Telangana 2023 : చంద్లాపూర్ ప్రత్యేకత చెప్పాలంటే.. ముందుగా చెప్పుకోవాల్సింది 3 టీఎంసీల సామర్థ్యం ఉన్న రంగనాయక సాగర్ గురించి. చంద్లాపూర్, లింగారెడ్డిపల్లి, పెద్ద కోడూరు, రామంచ, ఇమాంబాద్ గ్రామాల సరిహద్దులను కలుపుతూ మొత్తం 2 వేల 217 ఎకరాల్లో జలాశయాన్ని నిర్మించారు. రాష్ట్ర మంత్రి హరీశ్ రావు సారథ్యంతో అత్యంత వేగంగా ఈ ప్రాజెక్టు పూర్తైంది. గోదారమ్మ నీళ్లు.. మధ్యన కొండ, గుట్టల ప్రాంతంతో ఓ ద్వీపాన్ని తలపిస్తుంది. జలాశయం చుట్టూ 8.65 కిలో మీటర్ల మేర కట్టను తీర్చిదిద్దారు. జలాశయం మధ్య ద్వీపం మాదిరి (50 ఎకరాలు) ఉన్న స్థలం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది.
Chandlapur, Pembarthi Best Tourism Villages Telangana : ప్రస్తుతం ఇక్కడ నీటి పారుదల శాఖ అతిథి గృహం, ఎస్‌ఈ కార్యాలయం కొనసాగుతున్నాయి. పర్యాటక అభివృద్ధికి ప్రభుత్వం దండిగా నిధులు కేటాయించింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో సాగర్ చెంతన రూ.125 కోట్లతో పర్యాటకశాఖ అభివృద్ధి పనులు చేపట్టింది. అవి పూర్తైతే ఆహ్లాదానికి చిరునామాగా మారనుంది. సిద్దిపేట జిల్లా కేంద్రం నుంచి 8 కిలో మీటర్ల దూరంలో ఉన్న ఈ ప్రాజెక్టు.. ఎంతో మంది పర్యాటకులను ఆకట్టుకుంటుంది. సెలవు దినాల్లో సందర్శకుల తాకిడి మరింత ఎక్కువగా ఉంటోంది.