ఈ నెల 3న జరిగిన దుబ్బాక ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. మంగలవారం సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఇందూర్ ఇంజనీరింగ్ కళాశాలలోని డీ బ్లాక్‌లో లెక్కింపు జరగనుంది. ఇందుకోసం 850మంది సిబ్బందిని వినియోగిస్తున్నారు. వీరికి ఇప్పటికే శిక్షణ కూడా పూర్తి చేశారు. కరోనా నిబంధనలకు అనుగుణంగా లెక్కింపునకు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. లెక్కింపు కేంద్రాన్ని పరిశీలించిన కేంద్ర ఎన్నికల సంఘం పరిశీలకులు సంతృప్తి వ్యక్తం చేశారు. మధ్యాహ్నం వరకు విజేత ఎవరో తేలనుంది.
8 గంటలకు లెక్కింపు ప్రారంభం
ఉదయం ఐదు గంటలకే లెక్కింపు సిబ్బంది కేంద్రానికి చేరుకోనున్నారు. ఫార్మలిటీస్ పూర్తి చేసిన అనంతరం 8గంటలకు లెక్కింపు ప్రక్రియను ప్రారంభించనున్నారు. 14 టేబుళ్లపై 23 రౌండ్లలో కౌంటింగ్ జరగనుంది. మొదట పోస్టల్ బ్యాలెట్లు లెక్కించి... అరగంటలో పూర్తిచేయనున్నారు. అనంతరం ఈవీఎంలలో పోలైన ఓట్లు గణించనున్నారు. ఎటువంటి పొరపాట్లకు తావివ్వకుండా ప్రక్రియ సజావుగా పూర్తి చేసేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ప్రతి టేబుల్‌కు ఒక మైక్రో అబ్జర్వర్‌ను నియమించడం... ప్రక్రియను మొత్తం వీడియో తీయించనున్నారు. ఒక్కో రౌండ్ పూర్తికాగానే ఎన్నికల సంఘం వెబ్సైట్లో ఆ వివరాలు నమోదు చేయనున్నారు.