అమర్నాథ్ యాత్ర చేయాలన్న కోరిక ఉండి.. అంతదూరం వెళ్లలేని వారికి సిద్దిపేట ధార్మిక సంస్థ అద్భుత అవకాశాన్ని కల్పిస్తోంది. మహా శివరాత్రి సందర్భంగా సిద్ధిపేటలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో భారీ సెట్టింగులతో అమర్నాథ్ యాత్ర అనుభూతిని అందించేందుకు ఏర్పాట్లు చేశారు. మంచుకొండలు, అమర్నాథ్ గుహ, మంచులింగం, ద్వాదశ లింగాలు ఏర్పాటు చేశారు. పశ్చిమ బెంగాల్ కళాకారులతో భారీ మంచు కొండల సెట్టింగులు నిర్మిస్తున్నారు. అమర్నాథ్ ఆలయం నుంచి తెచ్చిన త్రిశూలం, మంచులింగం, ద్వాదశ లింగాలను భక్తులు శివరాత్రి రోజు దర్శనం చేసుకునే ఏర్పాట్లు చేస్తున్నారు. దూరం నుంచి నిజమైన మంచు కొండలేనేమో అనుకునేలా ఈ సెట్టింగులు ఏర్పాటు చేస్తున్నారు.
ఎత్తైన శివలింగం ఏర్పాటు..
అంతేకాదు.. అమర్నాథ్ యాత్రలో వచ్చే పర్యాటక, ఆధ్యాత్మిక కేంద్రాలైన పహెల్గామ్, చందన్ వడీ, శేష్నాగ్, పంచతరణి వంటి ప్రదేశాల నమూనాలను కూడా నిర్మిస్తున్నారు. బెంగళూరుకు చెందిన కళాకారులతో దేశంలోనే ఎత్తైన శివలింగం నమూనాను ఏర్పాటు చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో మాధవానంద సరస్వతి, మధుసూదనానంద సరస్వతి,విద్యాశంకర సరస్వతి, కృష్ణజ్యోతి స్వరూపానంద సరస్వతి, దుర్గాప్రసాద్ స్వామి, శివాచార్య మహాస్వామి మొదలగు ప్రముఖ పీఠాధిపతులు పాల్గొంటున్నారు.