తెలంగాణ

telangana

ETV Bharat / state

దుబ్బాకలో తారస్థాయికి చేరుకున్న ఉపఎన్నిక పోరు - దుబ్బాక ఉప ఎన్నికలు

దుబ్బాక ఉపఎన్నిక పోరు తారస్థాయికి చేరింది. ప్రచారానికి మూడురోజులే మిగలడంతో పార్టీలు జోరు పెంచాయి. త్రిముఖపోరులో పైచేయి సాధించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ప్రధాన పార్టీల రాష్ట్ర నాయకత్వమంతా దుబ్బాకలోనే మకాం వేసి.. తమ అభ్యర్థుల గెలుపు కోసం వ్యూహాలు రచిస్తున్నాయి.

all parties speed up dubbaka by election compaign
దుబ్బాకలో తారాస్థాయికి చేరుకున్న ఉపఎన్నిక పోరు

By

Published : Oct 30, 2020, 5:14 AM IST

Updated : Oct 30, 2020, 6:35 AM IST

దుబ్బాకలో తారస్థాయికి చేరుకున్న ఉపఎన్నిక పోరు

ప్రధాన పార్టీల విమర్శలు, ప్రతివిమర్శలతో దుబ్బాక ఉపసమరం హోరెత్తుతోంది. నవంబర్‌ 1న సాయంత్రం 5గంటలతో ప్రచార గడువు ముగియనున్నందున.. సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ.. నాయకులు ముందుకు సాగుతున్నారు. ప్రచార గడువు దగ్గర పడుతున్నకొద్దీ నియోజకవర్గంలో రాజకీయం మరింత వేడెక్కుతోంది. తెరాస తన ప్రచారంలో ప్రధానంగా భాజపాపై దృష్టి సారిస్తోంది. కేంద్ర నిర్ణయాలతో రైతులు నష్టపోతున్నారంటూ.. ర్యాలీలు, సభల్లో ప్రస్తావిస్తోంది. సిద్దిపేటలో అంజన్‌రావు ఇంట్లో నగదు స్వాధీనం అనంతరం పరిణామాలు పూర్తిగా మారిపోయాయి. తెరాస, భాజపా నాయకులు రాజకీయ ఆరోపణలతోపాటు వ్యక్తిగత విమర్శలకూ దిగుతున్నారు. మరోవైపు ప్రచారంలో నిమగ్నమైన కాంగ్రెస్.. తెరాస, భాజపా ఒకటేనని ఆరోపిస్తోంది.

సవాల్​ విసిరితే ముఖం చాటేశారు..

కేంద్రం నిధులపై చర్చలకు రావాలని తాను సవాల్‌ విసిరితే.. భాజపా నేతలు ముఖం చాటేశారని ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. సిద్దిపేట జిల్లా తొగుట మండలంలో ప్రచారం నిర్వహించిన ఆయన.. దుబ్బాక నియోజకవర్గ అభివృద్ధి బాధ్యత తనదేనని హామీ ఇచ్చారు. విపక్షాలకు ఓట్లేస్తే బావుల వద్ద మీటర్లు, బీడీలకు పుర్రెగుర్తు, జీఎస్టీతో ఉపాధిపోయే పరిస్థితులు వస్తాయన్నారు.

తెరాస మద్దతు పలుకుతోంది...

భాజపాతో తెరాస లోపాయికారి ఒప్పందం కుదుర్చుకుని రాష్ట్ర ఔన్నత్యాన్ని తాకట్టుపెడుతోందని పీసీసీ కార్యనిర్వహక అధ్యక్షుడు, ఎంపీ రేవంత్‌రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ అభ్యర్థి చెరుకు శ్రీనివాస్‌రెడ్డితో కలిసి.. మిరుదొడ్డి మండలంలో ఆయన ప్రచారం నిర్వహించారు. భాజపా తెచ్చే బిల్లులకు తెరాస మద్దతు పలుకుతోందన్న రేవంత్‌.... దుబ్బాకలో ఓడిస్తేనే ఇచ్చిన హామీలు నెరవేరుతాయని చెప్పారు.

కమలానికే పట్టం కడుతున్నాయి..

కేంద్రం నుంచి తెలంగాణకు భారీగా నిధులు వస్తున్నా.. తెరాస అసత్యాలు ప్రచారం చేస్తోందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఆరోపించారు. భాజపా అభ్యర్థి రఘునందన్‌రావుకు మద్దతుగా ఆయన మిరుదొడ్డి మండలం మోతెలో ప్రచారం చేశారు. రోజురోజుకి దుబ్బాకలో భాజపాకు ఆదరణ పెరుగుతోందన్న సంజయ్‌... సర్వేలు సైతం కమలానికే పట్టం కడుతున్నాయని తెలిపారు. కాగా.. దుబ్బాకలో ఉపఎన్నికల పారదర్శకంగా జరిగేలా చూడాలంటూ.. భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.. కేంద్ర ఎన్నికల కమిషనర్ సునీల్ అరోరాకు లేఖ రాశారు. తెరాస, భాజపాలు ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తున్నాయన్న ఆయన.. ఎన్నికలకు రాష్ట్ర పోలీసులను, జిల్లా అధికారులను ఉపయోగించవద్దని కోరారు.


ఇవీ చూడండి: బండి సంజయ్‌పై తెరాస నేతల ఫిర్యాదు

Last Updated : Oct 30, 2020, 6:35 AM IST

ABOUT THE AUTHOR

...view details