Fighting for lockup death case in siddipet district : దొంగతనం అనుమానంతో అమాయకులను పోలీసులు స్టేషన్‌కు తీసుకువెళ్లి క్రూరంగా హింసించడం.. దెబ్బలకు తట్టుకోలేక వారిలో ఒకరు చనిపోతే తప్పు కప్పిపుచ్చుకోడానికి కట్టుకథలల్లడం.. చివరకు న్యాయస్థానంలో దోషులుగా తేలడం.. ఇటీవల విడుదలైన ‘జైభీమ్’ సినిమాలో కథాంశమిది. ఎప్పుడో తమిళనాడులో జరిగిన యథార్థగాథ ఆధారంగా తీసిన ఆ సినిమాలో ‘సిన్నతల్లి’ పోరాటం ఫలించి లాకప్‌డెత్ బాధ్యులకు శిక్ష పడుతుంది. సరిగ్గా అలాంటి ఘటనే సిద్దిపేట జిల్లా తొగుట మండలంలో దాదాపు రెండు దశాబ్దాల క్రితం జరిగింది. తమిళనాడులో భర్త కోసం సిన్నతల్లి పోరాడితే ఇక్కడ తన తమ్ముడి లాకప్‌డెత్‌కు కారకులైన పోలీసులకు తగిన శిక్ష పడాలని పోరాడుతోంది అతడి సోదరి లక్ష్మీనర్సవ్వ. దాదాపు 20 ఏళ్లు అవుతున్నా ఆమెకు మాత్రం ఇంకా న్యాయం జరగలేదు. న్యాయం కోసం మరో పదేళ్లయినా పోరాడతానని చెబుతున్నారు.
ఏం జరిగింది?
సిద్దిపేట జిల్లా తొగుట మండలం వెంకట్రావుపేట గ్రామంలో 2002 ఏప్రిల్‌లో ప్రభాకర్ అనే వ్యక్తి అనుమానస్పద స్థితిలో చనిపోయాడు. ఈ ఘటనతో గ్రామంలో ఘర్షణలు చేలరేగాయి. హత్య కేసుల విచారణలో భాగంగా ఇదే గ్రామానికి చెందిన పలువురిని ఏప్రిల్ 5, 2002న పోలీసులు తొగుట పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. వారిలో యాదగిరి అనే యువకుడు ఉన్నాడు.. రాత్రి అయినా యాదగిరిని పోలీసులు ఇంటికి పంపకపోవడంతో అతని అక్క లక్ష్మీనర్సవ్వ మరునాడు ఉదయం స్టేషన్‌కు వెళ్లారు. హత్య చేసినట్లు ఒప్పుకోమ్మని పోలీసులు ఒత్తిడి చేస్తున్నట్లు యాదగిరి తనకు చెప్పాడని ఆమె తెలిపారు. తన తమ్ముడికి హత్యతో ఎలాంటి సంబంధం లేదని.. అతను అమాయకుడని.. ఇంటికి పంపించాలంటూ పోలీసులను ప్రాథేయపడినట్లు పేర్కొన్నారు. అయినా పోలీసులు పంపలేదని.. చేసేదిలేక ధైర్యం చెప్పి ఇంటికి వచ్చానని వివరించారు.
'రెండు ముచ్చట్లు అడిగి పంపుతాం అంటూ మా తమ్మున్ని తొగుట పోలీస్ స్టేషన్‌కు తోలుకపోయిన్రు. నేను బస్సు ఎక్కి స్టేషన్‌కు పోయినా. ప్రభాకర్ కేసు ఒప్పుకోమని పోలీసులు అడుగుతున్నారని మా తమ్ముడు అప్పుడు చెప్పిండు. మనం చేయనిది మనం ఎట్లా ఒప్పుకుంటాం అని నేను అన్నాను. సచ్చినా సరే మనం ఎందుకు ఒప్పుకుంటాం అని వాడు అన్నాడు. నేను కూడా సరే అన్నాను. నేను మళ్లీ ఇంటికి వచ్చిన.' -లక్ష్మీనర్సవ్వ
'మరుసటి రోజు మరికొందరిని స్టేషన్‌కు తీసుకుపోయారు. మూడో రోజు ఇంకొందరిని తీసుకుపోయారు. నాలుగో నాడు భోజనం తీసుకుని స్టేషన్‌కు పోయిన. మా తమ్ముడిని నడవలేకుండా కొట్టిన్రు. ఆ దెబ్బలకు నడువస్తలేడు. ఏం తప్పు చేసిండని మా తమ్మున్ని కొట్టిన్రు అని నేను అడిగినా. ఏం చేయలేదు. నువ్వు ఇంటికి పో... మేం టిఫిన్ ఇస్తామంటూ పోలీసులు మాట్లాడిన్రు. ఏం చేయలేక నేను ఇంటికి పోయినా. మళ్లీ మరుసటి రోజు పోయినా. మిగతా ఆరుగురిని ఇంటికి తోలిన్రు. మా తమ్ముడు ఎక్కడ అని నేను అడిగితే పారిపోయిండని చెప్పిన్రు. మా తమ్ముడు అట్ల పోడు అంటూ నేను గట్టిగా అడిగినా. రెండు ముచ్చట్లు అంటూ స్టేషన్‌కు తీసుకొచ్చి పారిపోయిండని చెబుతున్నారని పోలీసులను గట్టిగా అడిగిన.' -లక్ష్మీనర్సవ్వ
'పోలీసులే చంపేశారు'
తమ్ముడి ఆచూకీ కోసం పోలీసులను నిలదీసిన సరైన సమాధానం రాలేదని లక్ష్మీనర్సవ్వ ఆవేదన వ్యక్తం చేశారు. బంధువుల ఇళ్లలో వెతికినా సమాచారం లభించలేదని తెలిపారు. పోలీసులే తన తమ్ముడిని ఏదో చేశారన్న అనుమానంతో ఉన్నతాధికారులను ఆశ్రయించానని వివరించారు. అక్క లక్ష్మీనర్సవ్వ పోరాటంతో ఈ కేసు సంచలనంగా మారింది. యాదగిరి ఆదృశ్యంపై సిద్దిపేట అప్పటి డీఎస్పీ ప్రకాశ్ రెడ్డి ఆధ్వర్యంలో విచారణ చేపట్టారు. ఏప్రిలో 8న స్టేషన్లో యాదగిరి మృతి చెందగా.. పోలీసులే అతడి మృతదేహాన్ని తీసుకెళ్లి కొండపాక మండలంలోని పెద్ద గుట్టపై పాతి పెట్టారని గుర్తించారు. హైకోర్టు ఆదేశాలతో మూడు నెలల తర్వాత యాదగిరి మృతదేహాన్ని వెలికితీసి... రీపోస్టుమార్టం నిర్వహించారు. ఇందులో మరణించడానికి ముందు తీవ్రంగా కొట్టినట్లు గుర్తించారు. సీఐ మధుకర్ స్వామి, ఎస్సై కరీముల్లాషావలితో పాటు మరో నలుగురు కానిస్టేబుళ్లు బాధ్యులుగా గుర్తించి కేసు నమోదు చేసి.. అరెస్టు చేశారు.