ఈ రోజుల్లో వివాహేతర సంబంధాలు అనే మాట ఎక్కువగా వింటున్నాం. ఆ మోజులో పడి ఒక్కోసారి అన్యాయంగా ఎందరో జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే కట్టుకున్న వాడిని.. కడుపున పుట్టిన వారినీ వదిలేసేందుకు సిద్ధపడుతున్నారు. ఇదేంటని ప్రశ్నిస్తే చంపేందుకూ వెనకాడటం లేదు. క్షణిక సుఖాల కోసం కుటుంబాలను వీధి పాలు చేస్తున్న ఘటనలు అనేకం. తాజాగా పెళ్లయి.. పిల్లలున్న ఓ మహిళతో వివాహేతర సంబంధం ఓ విద్యార్థి ఆత్మహత్యకు దారి తీసింది.
సిద్దిపేట జిల్లాకు చెందిన ఓ విద్యార్థి ఉన్నత చదువుల కోసం హైదరాబాద్‌కు వచ్చాడు. కుటుంబానికి భారం కాకూడదని ఓ షాపింగ్‌మాల్‌లో ఉద్యోగం చేస్తూ చదువుకుంటున్నాడు. ఈ క్రమంలోనే అక్కడే ఓ వివాహితతో పరిచం ఏర్పడింది. అది కాస్తా వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఈ నేపథ్యంలోనే ఆమె మరో వ్యక్తితో చనువుగా ఉండటం తట్టుకోలేక పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
గ్రామస్థులు, కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. సిద్దిపేట జిల్లా కుకునూరుపల్లి మండలం మంగోల్‌కు చెందిన లగిశెట్టి అభిషేక్.. హైదరాబాద్‌లో డిగ్రీ చదువుతున్నాడు. ఇందులో భాగంగానే అతను సుచిత్ర ప్రాంతంలోని ఓ షాపింగ్‌మాల్‌లో పని చేస్తున్నాడు. అక్కడే ఓ వివాహితతో పరిచయమైంది. ఈ క్రమంలోనే వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఇటీవల ఆమె మరొకరితో చనువుగా ఉండటం అభిషేక్ గమనించాడు. ఇది సహించలేక మానసికంగా కుంగిపోయాడు. ఈ క్రమంలోనే ఇంటికి వచ్చేశాడు.