Husband committed suicide where his wife died : నిజజీవితంలో జీవిత భాగస్వామితో గొడవలు రావడం సాధారణమే. వాటిని అర్థంచేసుకుని ముందుకుసాగితేనే ఎటువంటి సమస్యలనైనా అధిగమించగలరు. ఒకరి అభిప్రాయాలకు మరొకరు విలువనివ్వకుండా.. అహంభావానికి పోతే ఇక జీవితంలో ఆనందం అనేది ఉండదు. సంసార జీవితం సాఫీగా సాగదు.
ఆ జంటకు పెళ్లై సంవత్సరం మాత్రమే అయ్యింది. భర్త మంచి గాయకుడు. రాష్ట్రస్థాయిలో పలు అవార్డులు కూడా పొందాడు. ఆనందంగా సాగిపోతున్న వారి జీవితంలో.. అనుకోకుండా వారికి ఏదో విషయంలో మనస్ఫర్ధలు వచ్చాయి. అర్థంచేసుకుని.. పరిష్కరించుకోవడంలో వారు విఫలమయ్యారు. తీవ్ర మనస్తాపం చెందిన భార్య పుట్టింటికి వెళ్లి చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది.
భార్య లేని లోటును అధిగమించలేకపోయిన భర్త.. మనస్తాపం చెంది తాను కూడా భార్య చనిపోయిన చోటే.. పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇందులో మరింత బాధాకరమైన విషయమేమిటంటే.. వారి పెళ్లిరోజే భర్త పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
పెళ్లి రోజే ఆత్మహత్య..: కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నేదునూరు గ్రామానికి చెందిన బోల్లంపల్లి శ్యాంసుందర్‌కు(35).. హుస్నాబాద్‌కు చెందిన శారద అనే అమ్మాయితో సంవత్సరం క్రితం వివాహం జరిగింది. అయితే భార్య భర్తల మధ్య ఏర్పడ్డ మనస్పర్ధలతో.. ఏడు నెలల క్రితం శారద హుస్నాబాద్ లోని తన పుట్టింటికి వెళ్లింది. అక్కడే ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. భార్య చనిపోయిన నాటి నుంచి తీవ్ర మనస్థాపంతో ఉంటున్న శ్యాంసుందర్.. భార్య శారద ఆత్మహత్య చేసుకున్న చోటే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.
అది కూడా వారి పెళ్లి రోజే ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు, బంధువులు తెలిపారు. ఆదివారం రాత్రి శారద ఇంటి వద్దకు చేరుకున్న శ్యాంసుందర్.. ఆమె ఉరివేసుకున్న చెట్టు వద్దే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకొని ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. శ్యాంసుందర్ మృతదేహాన్ని హుస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చనిపోయిన వ్యక్తి శ్యాంసుందర్ గాయకుడిగా రాణించాడు. రాష్ట్రస్థాయిలో పలు అవార్డులను గెలుపొందాడు.
ఇవీ చదవండి: