కార్తిక పౌర్ణమి వేళ సిద్దిపేట జిల్లా కోహెడ మండలం వరికోలు గ్రామంలోని మూడు కుటుంబాల్లో తీరని విషాదం నిండింది. 18 నుంచి 22 ఏళ్ల వయసున్న ఏడుగురు స్నేహితులు పండుగపూట కలుసుకున్నారు. ఊళ్లో ఆరేడేళ్లుగా చుక్క కూడా లేని మోయతుమ్మెద వాగు నీటితో నిండుగా కన్పించగా... పుణ్యస్నానాలు చేసొద్దామని నిశ్చయించుకున్నారు.
మింగిన రాకాసి గుంత...
ఎంతో సంబురంగా... ఒకరినొకరు జంటలు పట్టుకుని వాగులో నడుస్తూ వెళ్లారు. కానీ ఆ వాగులో పెద్ద గుంత ఉందని గుర్తించలేకపోయారు. ఆ రాకాసి గుంతలో ఒకరొకరుగా నలుగురు పడిపోయారు. అప్రమత్తమైన మిగతా ముగ్గురు జాగ్రత్తపడ్డారు. మునిగిపోయిన వారిని కాపాడేందుకు ప్రయత్నించారు. తీవ్రంగా శ్రమించి.. ఒక్క స్నేహితున్ని మాత్రమే కాపాడుకోగలిగారు.
ముగ్గురూ... ఒక్కొక్కరే...
స్నానానికి వెళ్లిన కుర్రాళ్లు ఎంతసేపటికీ రాకపోయేసరికి అనుమానమొచ్చిన కుటుంబసభ్యులు, ఇరుగుపొరుగువాళ్లు వెళ్లి చూడగా విషయం తెలిసింది. వాగులో వెతకగా... విగతజీవులుగా మారిన నిఖిల్, కూన ప్రశాంత్, వరప్రసాద్ మృతదేహాలు లభ్యమయ్యాయి. ఈ ముగ్గురు యువకులు... వారి తల్లిదండ్రులకు ఒక్కొక్క కొడుకే కావటం వల్ల రోదనలు మిన్నంటాయి. ఆ తల్లిదండ్రుల బాధను చూసి గ్రామమంతా విషాదం నిండింది.
ఇసుక మాఫియే మింగిందా...?
కొన్నేళ్లుగా వాగులో నీరు లేకపోవటం వల్ల అక్రమార్కులు ఇసుక మాఫియా సాగించారు. వాగులో పెద్ద గుంత తవ్వి ఇసుకను తరలించి సొమ్ము చేసుకున్నారు. ఇప్పుడు ఆ గుంతే... యువకుల పాలిట యమకూపంగా మారిందని గ్రామస్థులు ఆరోపించారు. కుర్రాళ్లకు ఈత రాకపోవడం కూడా మరో కారణంగా స్థానికులు తెలిపారు.
పుణ్య స్నానాలకై వెళ్లి... అనంతలోకాలకు వెళ్లిపోయారు ఇవీ చూడండి: మోయతుమ్మెద వాగులో మునిగి ముగ్గురు మృతి