భారీ వర్షాలు కురిసిన సమయంలో సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లోని హన్మకొండ రోడ్, అంబేడ్కర్ చౌరస్తా, బస్‌స్టేషన్, నాగారం రోడ్ తదితర ప్రాంతాలు జలమయం అవుతున్నాయి. దుకాణాల్లోకి వరద నీరు చేరుతుంది. ఈ సమస్య పరిష్కారానికి పురపాలక పాలక వర్గం ప్రయత్నాలు చేపట్టింది.
పదిహేనేళ్ల సమస్యకు మోక్షం - RAIN EFFECTS
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో భారీ వర్షం కురిస్తే ప్రధాన రహదారి, అంబేడ్కర్ చౌరస్తా జలమయమై వాగును తలపిస్తుంది. దాదాపు 15 ఏళ్లుగా ఈ సమస్యతో దుకాణాలు, ఇళ్లలోకి వరద నీరు చేరి ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు ఆ సమస్యకు పరిష్కారం లభిస్తోంది.
హన్మకొండ రోడ్ నుంచి సిద్దిపేట రోడ్ వరకు దాదాపు కి.మీ దూరం ఉన్న మురుగు కాలువలో ఏళ్ల తరబడి పేరుకు పోయిన పూడిక మట్టిని తొలగించే పని చేపట్టారు. దాదాపు మూడు అడుగుల లోతులో ఉన్న పూడికను, ప్లాస్టిక్ కవర్ల తొలగింపు చేపట్టారు.
వర్షం కురిసిన సమయంలో రహదారిపైకి చేరిన నీరు మురుగు కాలువల్లోకి వెళ్లేలా చేస్తున్నారు. తీసిన పూడిక మట్టిని పట్టణానికి వెలుపలికి తరలిస్తున్నారు. వారం రోజుల పాటు ఈ పనులు పూర్తి చేశారు. కొనసాగుతున్న పనులను పురపాలిక ఛైర్‌పర్సన్ ఆకుల రజిత, వైస్ ఛైర్మన్ ఐలేని అనిత, కమిషనర్ రాజమల్లయ్య పర్యవేక్షించారు.