Zaheerabad Integrated Market Not Allocated To Beneficiaries :పురపాలికకు ఆదాయాన్ని సమకూర్చడంతో పాటు వ్యాపారాలకు దుకాణాల కొరత తీర్చాలనే ఉద్దేశంతో.. ప్రభుత్వం బహుళ ప్రయోజన విధానంలో సమీకృత వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్(Integrated Veg and Non Veg Market) నిర్మాణాలు చేపట్టింది. ఈ నేపథ్యంలో 2022 డిసెంబర్ 27వ తేదీన జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యే మాణిక్‌రావుతో కలిసి మంత్రి హరీశ్‌రావు(Minister Harish Rao) సమీకృత మార్కెట్‌ను ప్రారంభించారు.
దీంట్లో గ్రౌండ్ ఫ్లోర్లో 33, మొదటి అంతస్తులో 34 కలిపి మొత్తం 67 దుకాణాలు ఉన్నాయి. ఇందులో 53 దుకాణాలకు 2023 ఫిబ్రవరి 4 వరకు దరఖాస్తులు స్వీకరించిన అధికారులు.. 8వ తేదీన వేలం ప్రక్రియ పూర్తి చేశారు. వేలం, కేటాయింపు ప్రక్రియ పూర్తి చేసి ఆరు నెలలు గడుస్తున్నా నేటికీ కేటాయింపు జరగలేదు. వేలంలో షాపులు దక్కించుకున్న వారు నిత్యం మున్సిపల్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా కమిషనర్, సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని బాధితులు అంటున్నారు.
మూడు నెలల అద్దె చెల్లిస్తే.. రిజిస్ట్రేషన్ చేయిస్తాం..: వేలంలో పాల్గొనేందుకు రూ.50 వేలు డిపాజిట్ చేయడంతో పాటుదుకాణం కేటాయింపు చేయడంతో ఆరు నెలల అద్దె అడ్వాన్సుగా చెల్లించామని దుకాణదారులు చెబుతున్నారు. వీటితో పాటు రూ.2 లక్షల విలువైన సాల్వెన్సీ సర్టిఫికెట్ సమర్పించినా దుకాణం అప్పగించకపోవడంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నామని బాధితులు వాపోతున్నారు. కేటాయించిన దుకాణాలను తమ పేరిట రిజిస్ట్రేషన్ చేయాలని వేలంలో దుకాణాలుదక్కించుకున్న వారు కోరుతున్నారు. ఇందుకోసం మూడు నెలలకు సంబంధించి అద్దె చెల్లిస్తే లబ్దిదారుల పేరిట రిజిస్ట్రేషన్ చేయిస్తామని అధికారులు చెబుతున్నారు. అయితే తాము ఇప్పటికే నిర్దేశించిన మొత్తాన్ని చెల్లించామని దుకాణాలు దక్కించుకున్నవారు అంటున్నారు. ప్రధాన రహదారి కాబట్టి ఆర్థికంగా కలిసి వస్తుందని వేలంలో దక్కించుకున్న ఆశ.. నిరాశగా మిగులుతోందని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.