తెలంగాణ

telangana

ETV Bharat / state

Corona: తాళి కట్టి ధైర్యం చెప్పినా.. కాటేసిన కరోనా! - Sangareddy district Latest corona news

ఓ యువతికి కరోనా సోకింది. ఆమెను కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో చేర్పించారు. ఆరోగ్యం క్షీణిస్తూ ఉండడంతో... ఆమెను ప్రేమించిన వ్యక్తి వెంటిలేటర్ మీదే తాళి కట్టి భార్యను చేసుకుని మరీ ధైర్యం చెప్పాడు. కానీ చివరికి విధి వారి తలరాతను వేరేలా రాసింది.

women-died-of-corona-in-sangareddy-district
Corona: తాళి కట్టి ధైర్యం చెప్పినా.. కాటేసిన కరోనా!

By

Published : May 31, 2021, 10:54 AM IST

Updated : May 31, 2021, 8:51 PM IST

కరోనా ఎన్నో బంధాలను బలితీసుకుంటోంది. ఎన్నో కుటుంబాల్లో విషాదాన్ని, అంతులేని శోకాన్ని మిగుల్చుతోంది. ఆప్తులు, ఆత్మీయులను కోల్పోయి.. వారి జ్ఞాపకాలతో జీవచ్ఛవాలుగా బతుకుతున్న వారెందరో..!ఇలాంటిదే ఈ విషాద ఘటన.

సంగారెడ్డి జిల్లా శివారు ప్రాంతానికి చెందిన 27 ఏళ్ల యువతి జీవితంపై ఎన్నో కలలు కంది. ఉన్నత చదువులు చదివి, ఉద్యోగం చేస్తున్న ఓ యువకుడిని ఈ ఏడాది చివర్లో పెళ్లి చేసుకుని సంతోషంగా జీవించాలనుకుంది. అంతలోనే ఆమెకు కరోనా సోకింది. దీంతో కుటుంబసభ్యులు చికిత్స కోసం ఆమెను హైదరాబాద్‌లోని ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. మూడేళ్లుగా ఆ యువతిని ప్రేమిస్తున్న యువకుడూ ఆమెకు ఎంతో ధైర్యం చెబుతూ బతికించుకునే ప్రయత్నం చేశాడు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో వైద్యులు ఆమెను వెంటిలేటరుపై ఉంచి చికిత్స అందించారు.

వెంటిలేటర్ పైనే పెళ్లి..

వైద్యుల అనుమతితో యువకుడు వెంటిలేటరుపై చికిత్సలో ఉన్న యువతితో మాట్లాడాడు. ‘కరోనాను ఎదుర్కొని నువ్వు క్షేమంగా ఇంటికొస్తావు. అందరూ మెచ్చేలా మనం మంచి దంపతులుగా బతకుదామంటూ' భరోసా ఇచ్చాడు. ఆ క్షణమే ఆసుపత్రి బెడ్‌ మీద ఉన్న యువతి మెడలో తాళి కట్టి.. ‘నేను నీ భర్తను.. నిన్ను కాపాడుకుంటా’నంటూ అభయమిచ్చాడు.

విధి వేరేలా..!

కానీ.. అనుకున్నది అనుకున్నట్టు జరిగితే అది జీవితం ఎందుకవుతుందీ? అందుకేనేమో అన్నట్టుగా.. వెంటిలేటరు మీద ఉన్న ఆ యువతి కొన్ని రోజుల పాటు మృత్యువుతో పోరాడి ఇటీవల కన్నుమూసింది. ఆమె సోదరుడు, ప్రేమించిన యువకుడే దగ్గరుండి ఆ యువతి అంత్యక్రియలు నిర్వహించారు.

పంటి బిగువున దుఃఖం

ఆమె మరణించిన విషయం మాత్రం తల్లిదండ్రులకు తెలియదు. ఆ యువతి మరణించిన మరుక్షణం నుంచి.. ఆమె సోదరుడు, తాళి కట్టిన యువకుడు.. కడుపులోంచి తన్నుకొస్తున్న దుఃఖాన్ని గుండెల్లోనే అదిమిపట్టి కుమిలిపోతున్నారు. తెరలుతెరలుగా మనసుపొరలను ఆవహిస్తున్న ఆమె జ్ఞాపకాలను ఆ యువకుడు నెమురవేసుకుంటూనే ఉన్నాడు. అందమైన కలలు కల్లలయ్యాయని, జీవితం కల్లోలమైపోయిందని వెక్కివెక్కి ఏడుస్తూనే ఉన్నాడు.

ఇదీ చూడండి:AYUSH: ఆయుష్‌ అస్త్రం.. బ్లాక్‌ ఫంగస్‌ బాధితులకు ఊరట

Last Updated : May 31, 2021, 8:51 PM IST

ABOUT THE AUTHOR

...view details