విద్యకు ఆకలి ఆటంకం కాకూడదన్న లక్ష్యంతో.. గవర్నమెంట్ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం పథకం సర్కార్అమలు చేస్తోంది. దీని ద్వారా పౌష్టికాహార లోపాన్ని నివారించడానికి భోజనంలో ప్రతి విద్యార్థికి నెలకు 12గుడ్లను అందిస్తోంది. ఇందుకోసం భోజన ఖర్చులకు అదనంగా ఒక్కో గుడ్డుకు నాలుగు రూపాయల చొప్పున నిర్వాహకులకు ప్రభుత్వం అందిస్తోంది. అయితే... అక్షయ పాత్ర ద్వారా మధ్యాహ్న భోజనం సరఫరా అవుతున్నా పాఠశాల విద్యార్థులకు గుడ్డు అందడం లేదు.
పౌష్టికాహారం అంతంతమాత్రమే...
ఉమ్మడి మెదక్ జిల్లాలో అక్షయ పాత్ర 530పాఠశాలలో చదువుతున్న 64వేల 399 మంది విద్యార్థులకు భోజనం సరఫరా చేస్తోంది. భోజనానికి, గుడ్లకు వేర్వేరుగా బిల్లులు చెల్లిస్తున్నారు. నిధులకు ఇబ్బంది లేకున్నా పౌష్టికాహారం అందించే విషయంలో ప్రభుత్వం విఫలమవుతోంది.
మా పిల్లలకు గుడ్డు కావాలి..!
ప్రస్తుతం అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణీలు, చిన్నారులకు గుడ్డు అందిస్తున్నారు. వీరికి సరఫరా చేస్తున్న వారి సహాయంతో అక్షయపాత్ర భోజనం అందిస్తున్న బడుల్లో విద్యార్థులకు గుడ్డు అందేలా చేయవచ్చు. ఉపాధ్యాయులు సైతం తమ విద్యార్థులకు గుడ్డు అందించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.