Telangana HC on sahiti infra case: ప్రీ లాంచ్ పేరిట మోసాలకు పాల్పడ్డారన్న అభియోగాలపై సాహితీ ఇన్‌ఫ్రాపై ఫిర్యాదులన్నింటినీ కలిపి ఒకే కేసుగా దర్యాప్తు చేయాలని సీసీఎస్ పోలీసులకు హైకోర్టు స్పష్టం చేసింది. ఒకే కేసుగా పరిగణించి మూడు నెలల్లో దర్యాప్తు పూర్తి చేయాలన్న సింగిల్ జడ్జి తీర్పులో జోక్యం చేసుకోబోమని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ధర్మాసనం తెలిపింది.
అమీన్‌పూర్‌లో సాహితీ శర్వాణి ఎలైట్ పేరుతో 25 ఎకరాల్లో 32 అంతస్తులతో 10 టవర్లు నిర్మిస్తామంటూ సుమారు 1500 కోట్ల రూపాయల మోసానికి పాల్పడ్డారని సాహితీ ఇన్‌ఫ్రాపై వివిధ పోలీస్ స్టేషన్లలో అనేక ఫిర్యాదులు వస్తున్నాయి. బాధితులు వేరయినప్పటికీ.. మోసం ఒకటే అయినందున.. అన్నింటినీ కలిపి హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వేర్వేరు పోలీస్ స్టేషన్ల్లో కేసులు పెట్టడం లేదని దాఖలైన పలు పిటిషన్లను గతంలో విచారణ జరిపిన సింగిల్ జడ్జి.. అన్ని కలిపి విచారణ జరిపి మూడు నెలల్లో దర్యాప్తు పూర్తి చేయాలని ఆదేశించారు. సింగిల్ జడ్జి తీర్పును సవాల్ చేస్తూ సాహితీ ఇన్‌ఫ్రా మాజీ డైరెక్టర్లు వేసిన అప్పీళ్లు విచారణకు అర్హం కావంటూ సీజే ధర్మాసనం కొట్టివేసింది.