ఆడవారి ఆలోచనలు ప్రపంచస్థాయిలో ఉండాలి KTR About Women Entrepreneurs : మహిళా పారిశ్రామిక వేత్తలు అంతర్జాతీయస్థాయి ఆవిష్కరణలు చేయాలని.. ఆలోచనలు ప్రపంచస్థాయిలో ఉండాలని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ సూచించారు. సంగారెడ్డి జిల్లా సుల్తాన్‌పూర్‌లో 50 ఎకరాల్లో ఏర్పాటు చేసిన మహిళా పారిశ్రామిక పార్కును ప్రారంభించారు. ఇండస్ట్రీయల్ పార్కు పైలాన్‌ను ఆవిష్కరించారు.
KTR on Women's Day : మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు అన్ని రకాలుగా సహకరిస్తున్నామని కేటీఆర్ అన్నారు. మహిళా పారిశ్రామిక పార్కులో 10 శాతం పెట్టుబడి రాయితీ అందిస్తున్నట్లు వెల్లడించారు. తెలంగాణ రాష్ట్ర సమగ్రాభివృద్ధితో ప్రగతి పథంలో దూసుకుపోతోందని తెలిపారు. రాష్ట్రం ఏర్పడ్డ నాటి నుంచి జీడీపీలో 130 శాతం వృద్ధి సాధించామని చెప్పారు. తలసరి ఆదాయంలోనూ మంచి వృద్ధి సాధించామని వివరించారు.
"మహిళాభివృద్ధికి తెలంగాణ సర్కార్ ఎప్పుడూ కట్టుబడి ఉంటుంది. మహిళా పారిశ్రామికవేత్తల కోసం ఏర్పాటైన ఏకైక కేంద్రం వీహబ్. హైదరాబాద్‌లో ఏర్పాటైన వీహబ్‌కు సీఈవోగా దీప్తి ఉన్నారు. వీహబ్ సందర్శించి మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి. వీహబ్ నుంచి ఇప్పటికే 2,194 స్టార్టప్‌లు రూపకల్పన చేశాం. స్టార్టప్‌ల కోసం రూ.66.3 కోట్లు నిధులు కేటాయిస్తున్నాం. స్టార్టప్ నిధులతో 2,800 మందికి ఉపాధి కల్పన జరుగుతోంది. దేశంలో తొలిసారి మహిళా పారిశ్రామికవేత్తల కోసం కొత్త కార్యక్రమం చేపట్టాం."
- కేటీఆర్, రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి
KTR Wishes on Women's Day : 'ఉద్యామిక' ద్వారా మహిళా పారిశ్రామికవేత్తలకు అవకాశాలు కల్పిస్తున్నామని మంత్రి కేటీఆర్ అన్నారు. ఉద్యామిక ద్వారా మహిళా పారిశ్రామికవేత్తల ఫిర్యాదులు పరిష్కరిస్తామని చెప్పారు. ఇందులో భాగంగా సంప్రదింపుల కమిటీ ఏర్పాటు చేశామని వెల్లడించారు. కమిటీ ద్వారా ప్రాసెస్, రివ్యూ, ఆర్థిక ప్రోత్సాహకాలు అందిస్తామని తెలిపారు. సులభతర వాణిజ్యానికి కార్పస్ ఫండ్ ఏర్పాటు కావాలని అభిప్రాయపడ్డారు. ప్రపంచస్థాయి ఉత్పత్తులతో పురోభివృద్ధి సాధించాలని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.