Telangana Election Arrangements 2023 :అసెంబ్లీ ఎన్నికల వేళ ప్రశాంత వాతావరణం నెలకొల్పేందుకు పోలీస్ శాఖ తగిన చర్యలు తీసుకుంటోంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భరోసా కల్పిస్తూ ప్రజల్లో అవగాహన పెంచుతోంది. నామినేషన్ ప్రక్రియ ప్రారంభం కావడంతో కేంద్రాల వద్ద పోలీసులు గస్తీతో పాటు.. కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేశారు.
Security For Telangana Assembly Elections 2023 :మరోవైపు పోలింగ్ జరిగే ప్రాంతాల్లోని కాలనీలలో ప్రత్యేక బృందాలు కవాతు నిర్వహిస్తున్నాయి. హైదరాబాద్ చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలోని వివిధ కాలనీల ప్రధాన కూడళ్ల వద్ద పోలీసులు కవాతు నిర్వహించారు. హైదరాబాద్ వ్యాప్తంగా.. నగదు ప్రవాహాన్ని అడ్డుకునేందుకు ఫ్లయింగ్ స్క్వాడ్‌లతో కూడిన 18 చెక్‌పోస్టులను ఏర్పాటు(Check Posts Arranged) చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రోస్ తెలిపారు. నామినేషన్ల కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందని వెల్లడించారు
Voter Awareness Programs in Telangana 2023 : నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గంలో అభ్యర్థుల నామినేషన్లకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. సంగారెడ్డి జిల్లా ఆందోల్ మండలం జోగిపేటలోని క్లాక్ టవర్ వద్ద పోలీసులు ఓటు హక్కు వినియోగంపై బైక్ ర్యాలీనీ నిర్వహించారు. ఓటు హక్కు వినియోగించుకునే తీరును బొమ్మల రూపంలో ప్రదర్శించారు. సంగారెడ్డిలోని ప్రభుత్వ మహిళా కళాశాలలో ఈటీవీ- ఈనాడు ఆధ్వర్యంలో ఓటు హక్కుపై అవగాహన కార్యక్రమాన్ని(Awareness Program on Voting Rights) నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ విచ్చేసి.. ప్రజాస్వామ్యంలో ఓటుకు ఉన్న ప్రాముఖ్యతను వివరించారు.
"రానున్న ఎన్నికల్లో యువత అందరూ పాల్గొనాలి. ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరిగే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. ఎన్నికల ప్రవర్తనా నియమావళిలో ఏదైనా ఉల్లంఘన జరిగినట్టు అనిపిస్తే.. సీ-విజిల్ అనే యాప్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. 100 నిమిషాల్లోపే సమాచారాన్ని తెలుసుకుని పరిష్కారం చేసేలా ఏర్పాట్లు చేస్తాం." - చంద్రశేఖర్, అదనపు కలెక్టర్, సంగారెడ్డి