Teachers Arrest: జీవో 317ను వ్యతిరేకిస్తూ ప్రగతిభవన్ ముట్టడికి యత్నించిన ఉపాధ్యాయులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని బొల్లారం పీఎస్కు తరలించారు. ఉపాధ్యాయుల బదిలీలపై సీఎం కేసీఆర్కు వినతి పత్రం ఇచ్చేందుకు మంచిర్యాల, జనగామ, సిద్దిపేట్, వరంగల్, హనుమకొండ, నిర్మల్, కరీంనగర్ జిల్లాలకు చెందిన ఉపాధ్యాయులు ఇవాళ హైదరాబాద్కు చేరుకున్నారు.
పీఎస్లోనే ఉపాధ్యాయుల నిరసన సమాచారం ముందుగానే అందుకున్న పోలీసులు.. ఉపాధ్యాయులు జేబీఎస్ వద్దకు రాగానే అదుపులోకి తీసుకొని బొల్లారం పీఎస్కు తరలించారు. ఉపాధ్యాయులు పోలీస్ స్టేషన్లోనే నిరసన తెలియజేశారు. జీవో 317ను రద్దు చేయాలని ప్లకార్డులు ప్రదర్శించారు. దాదాపు 40మంది ఉపాధ్యాయులను సొంత పూచీకత్తుపై విడుదల చేశారు.
ఉపాధ్యాయులను తరలిస్తున్న పోలీసులు 'అయ్యా సీఎం సార్ మా స్థానికత ఆధారంగానే ఉద్యోగ బదిలీలు చేపట్టండి. మమ్మల్ని మా సొంత జిల్లాలకే కేటాయించండి. తెలంగాణ ఉద్యమ సమయంలో మేం పోరాటం చేసింది మీకు తెలియదా? విద్య నేర్పే గురువులను క్షోభకు గురి చేయడం మంచిది కాదు. మా బాధలు పండుగ రోజు మీతో చెప్పుకునేందుకు వస్తే అరెస్టులు చేస్తారా? దయచేసి మీవెంట నడిచే మా గురించి ఆలోచించాలని విజ్ఞప్తి చేస్తున్నాం.'- ప్రభుత్వ ఉపాధ్యాయుడు
టీచర్లను అరెస్ట్ చేయడం దుర్మార్గం
Revanth reddy on arrest: రాష్ట్రంలో ఉపాధ్యాయుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. ప్రగతిభవన్ వద్ద అరెస్ట్ చేసిన ఉపాధ్యాయ నాయకులను వెంటనే విడుదల చేయాలన్నారు. ప్రజాస్వామ్య పద్ధతిలో రాజ్యాంగబద్ధంగా ప్రగతి భవన్ ఎదుట నిరసన వ్యక్తం చేయడానికి వచ్చిన టీచర్లను అరెస్ట్ చేయడం దుర్మార్గమని విమర్శించారు.
జీవోను రద్దు చేయాలి
revanth reddy on GO 317: తెలంగాణ ఉద్యమంలో ఉపాధ్యాయుల పాత్ర చాలా కీలకమైందని.. వారి పోరాటం మరువలేనిదని రేవంత్ రెడ్డి కొనియాడారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ఉపాధ్యాయుల పోరాటానికి కాంగ్రెస్ సంపూర్ణ మద్దతు ఇస్తుందని ప్రకటించారు. జీవో 317 రద్దయ్యే వరకు ఉపాధ్యాయుల పోరాటంలో వెన్నంటి ఉంటూ కాంగ్రెస్ మద్దతు ఇస్తుందని భరోసా ఇచ్చారు. ఉపాధ్యాయుల, ఉద్యోగులకు హక్కులకు భంగం కలిగించే జీవోను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. తెలుగు ప్రజలకు అత్యంత సంప్రదాయ పండుగ సంక్రాంతి పర్వదినం నాడు ఉపాధ్యాయుల సంఘాల నేతలతో ఎలాంటి చర్చలు జరపకుండా అరెస్టులు చేయడం చాలా దారుణమని రేవంత్‌రెడ్డి మండిపడ్డారు.