Sultanpur Medical Devices Park : ప్రపంచంలో 1,800 వైద్య పరికరాల పరిశ్రమలుండగా.. వాటిలో భారత్‌లో ఉన్నవి 120 మాత్రమే. ఇందులో తెలంగాణలోనే 50 ఉన్నాయి. వైద్య పరికరాల్లో అధిక శాతం విదేశాల నుంచే దిగుమతి అవుతున్నాయి. విభాగాల వారీగా చూస్తే పరికరాల్లో 90%, ఇంప్లాంట్లలో 75%, రోగులకు అవసరమైన సామగ్రిలో 80%, కన్స్యూమబుల్స్‌లో 60% ఇందులో ఉన్నాయి. ఇప్పటివరకు దిగుమతులపైనే ఆధారపడిన భారత్ ఇప్పుడిప్పుడే సొంత తయారీ దిశగా అడులు వేస్తోంది. ఇందులో భాగంగా తెలంగాణ కిరీటంలో అమరిన నగ.. వైద్యపరికరాల పార్కు. సుల్తాన్‌పూర్‌లో నాలుగేళ్ల కిందట ఏర్పాటైన ఈ పార్కులో ఇప్పటివరకు రూ. 10 వేల కోట్ల పెట్టుబడులతో 50 పరిశ్రమలు కొలువుదీరాయి.
Medical Devices Park in Telangana : ఇంజక్షన్ వేసేందుకు ఉపయోగించే సిరంజీలు మొదలుకొని గుండె సజావుగా పనిచేసేందుకు వాడే స్టెంట్ల వరకు.. కార్డియాక్ డయాగ్నొస్టిక్, అల్ట్రాసౌండ్ పరికరాలు, వెంటిలేటర్లు, ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్లు, పీపీఈ సహా అన్ని రకాల కిట్ల తయారీ.. దేశ విదేశాలకు ఎగుమతి.. 15 వేల మందికి ప్రత్యక్షంగా, 30 వేల మందికి పరోక్షంగా ఉపాధి.. తెలంగాణ వైద్య పరికరాల పార్కు పురోగతి ఇది. ఇక్కడ పరిశ్రమల ఏర్పాటుకు ప్రపంచ ప్రసిద్ధ సంస్థలతో ప్రభుత్వం భాగస్వామ్యాలు కుదుర్చుకుంది.
ప్రత్యేక రాయితీలు, ప్రోత్సాహకాలు
Medical Devices Park in Sultanpur : సంగారెడ్డి జిల్లాలోని సుల్తాన్‌పూర్‌లో ప్రభుత్వం ఈ పార్కును 2017 అక్టోబరులో 302 ఎకరాల్లో ప్రారంభించింది. రూ.50 వేల కోట్ల పెట్టుబడులు, 9 లక్షల మందికి ఉపాధి దీని లక్ష్యం. ప్రారంభించిన రోజే 14 సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఈ నెలలో ప్రారంభమైన ఏడు కొత్త పరిశ్రమలతో కలిపి.. మొత్తం వాటి సంఖ్య 50కి చేరింది. వీటి ద్వారా ఏటా రూ.20 వేల కోట్ల విలువైన పరికరాలు ఉత్పత్తి అవుతున్నాయి. వీటిలో 70 శాతం దేశ, విదేశాలకు ఎగుమతి అవుతుండగా.. మిగిలినవి స్థానికంగా వాడుతున్నారు. మరో 500 ఎకరాలు సేకరించి.. పార్కును విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. టీఎస్‌ఐపాస్ విధానం కింద పరిశ్రమల స్థాపనకు ముందుకొచ్చే సంస్థలకు ప్రభుత్వం ప్రత్యేక రాయితీలను, ప్రోత్సాహకాలను అందిస్తోంది. మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తోంది.
ప్రధాన పరిశ్రమల్లో కొన్ని..
Telangana Medical Devices Park : సహజానంద్ మెడికల్ టెక్నాలజీస్ (ఎస్‌ఎంటీ): రూ.533 కోట్ల పెట్టుబడితో సుమారు 2వేల మందికి ఉపాధి అవకాశాలను కల్పించే లక్ష్యంతో ఆసియా ఖండంలోనే అతిపెద్ద స్టెంట్ల ఉత్పత్తి పరిశ్రమ నెలకొల్పింది.
విర్చో బయోటెక్:రూ.179 కోట్ల పెట్టుబడితో సర్జికల్ యంత్రాల తయారీ
అర్కా మెడికల్ డివైజెస్:రూ.153 కోట్లతో దంతవైద్య ఉపకరణాలు
బీ-బ్రాన్: ఈ జర్మన్ కంపెనీ రూ.100 కోట్ల పెట్టుబడితో ఇన్ఫ్యూజన్ థెరపీ, హైపోడెర్మిక్ సిరంజీలు, సూదులు
ప్రొమియా థెరప్యూటిక్స్: రూ.51 కోట్లతో గాయాలకు చికిత్స అందించే పరికరాలను ఉత్పత్తి చేస్తోంది. నెలకు 50 లక్షల ఐవీ ఫ్లూయిడ్స్ తయారీతో ఈ సంస్థ దేశంలోనే ప్రథమ స్థానంలో ఉంది.
సిప్రా:రూ.44 కోట్లతో ఇంప్లాంట్ల తయారీ
ఇన్విట్రాన్: రూ.37 కోట్లతో ప్రయోగశాలల పరికరాలు
అప్పిడి టెక్నాలజీస్:రూ.26కోట్లతో డిసిన్ఫెక్షన్ పరికరాలు
కీ-కేర్: రూ.25 కోట్లతో ఔషధాల తయారీ పరికరాలు
మేజిక్ మెడికల్:రూ.21 కోట్లతో థర్మోప్లాస్టిక్ ట్యూబ్‌లు
హువెల్: రూ.17 కోట్లతో మల్టిఫ్లెక్స్ పీసీఆర్ కిట్లు
సెన్సాకోర్:రూ.14 కోట్లతో డయాగ్నెస్టిక్ ఎనలైజర్లు, కేర్ డివైజెస్
ఫ్లెక్సిడ్:రూ.14 కోట్లతో ప్యాకేజింగ్ పరికరాలు
ఆకృతి లాజిస్టిక్స్:కంటి వైద్యపరికరాలు
ఎస్‌వీపీ టెక్నో:రోబోటిక్, మోషన్ యంత్ర పరికరాలు
మాన్ మెషిన్:అల్ట్రాసౌండ్ స్కానర్లు
ఎవికాన్ ఇండియా: మెడికల్ ఇన్‌ప్లాంట్ ఉపకరణాలు