government school: శిథిలావస్థకు చేరిన తరగతి గదులు.. ఎప్పుడు మీద కూలుతాయో తెలియని పైకప్పులు.. ఎవరిని కాటేస్తాయో తెలియని విషపురుగులు.. ఇలాంటి పరిస్థితుల్లో చదువులు సాగిస్తున్నారు సంగారెడ్డి జిల్లా సదాశివపేటలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు. శతాబ్ద చరిత్ర ఉన్న ఈ పాఠశాలలో చదువుకున్న ఎంతో మంది విద్యార్థులు నేడు ఉన్నత స్థాయిలో రాణిస్తున్నారు. గతమెంతో ఘనకీర్తి ఉన్నా.. నేడెంతో అపకీర్తి అన్నట్లుగా మారింది.
వందేళ్ల క్రితం నాటి ఈ పాఠశాల భవనం పూర్తిగా శిథిలావస్థకు చేరిపోయింది. ఇప్పటికే చాలా వరకు గోడలు కూలిపోయాయి. పైకప్పులు ధ్వంసమయ్యాయి. కిటికీలు, తలుపులు సైతం లేకపోవటంతో.. తరగతి గదులు చీమలు, పందికొక్కులు, పాములకు నిలయాలుగా మారాయి. ఈ పరిస్థితుల్లో బడిలో చదువులు కొనసాగించలేక ఆవరణలోని చెట్ల కిందే కాలం వెళ్లదీస్తున్నారు. ఈ పరిస్థితుల్లో వేసవిలో తీవ్ర ఇబ్బందులకు గురైన విద్యార్థులు.. ఇక వర్షాకాలం వచ్చిందంటే చదువును మధ్యలోనే ఆపేసి వెళ్లిపోవాల్సి వస్తుందని వాపోతున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికోసం చేపట్టిన 'మన ఊరు-మన బడి' కార్యక్రమంలో ఈ పాఠశాల మరమ్మతులకు ప్రతిపాదించినా ఇప్పటికి ఎలాంటి అడుగులు పడలేదు. ఫలితంగా పిల్లలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తప్పక ఇటువంటి పరిస్థితుల్లోనే తరగతులు నిర్వహిస్తున్నామని ఉపాధ్యాయులు చెబుతున్నారు.
బయట హంగు ఆర్భాటాలతో ప్రైవేటు పాఠశాలలు హడావిడి చేస్తున్న సమయంలో.. ఆ స్థాయిలో డబ్బులు వెచ్చించలేక పిల్లలను ప్రభుత్వ పాఠశాలకు పంపుతున్నామని తల్లిదండ్రులు చెబుతున్నారు. తమ బిడ్డల జీవితాలతో చెలగాటమాడకుండా సర్కార్ వెంటనే దృష్టి సారించి, బడిని బాగుచేయాలని వారు కోరుతున్నారు.