సుమారు 50 మంది తమ సమస్యలను సంగారెడ్డి కలెక్టర్‌కు విన్నవించేందుకు ప్రజావాణికి వచ్చారు. కలెక్టర్‌కు అర్జి ఇచ్చి తమ సమస్యలపై సానుకూలంగా స్పందించాలని విజ్ఞప్తి చేశారు. అంతా బయటికి వచ్చి పాలనాధికారి స్పందనపై చర్చించుకుంటున్నారు. కొంత మంది వీడియో కాల్ ద్వారా కలెక్టరేటుకు రాని మిత్రులకు సమాచారం ఇస్తున్నారు. ఇంతా జరుగుతున్నా.. కొంచెం శబ్ధం కూడా రావడం లేదు. ఇందుకు కారణం వారంత బధిరులు. చెవిటి, మూగ సమస్యలతో బాధపడుతున్నవారు. చేతి సైగల ద్వారా సమాచారాన్ని ఇచ్చి పుచ్చుకుంటున్నారు.
బధిరుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న భారతి ఆధ్వర్యంలో వీరంతా సంగారెడ్డి కలెక్టరేట్‌కు వచ్చారు. తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులు పాలనాధికారి దృష్టికి తీసుకువచ్చారు. వీరికి ప్రభుత్వం అందిస్తున్న 4జీ మొబైల్ ఫోన్‌ను వయసుతో సంబంధం లేకుండా అందరికీ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.