తెలంగాణ

telangana

ETV Bharat / state

Singoor Power project: సింగూరు జల విద్యుత్‌ కేంద్రం.. ఏడాదిలో మూడోస్థాయి గరిష్ఠ ఉత్పత్తి - సింగూర్ జల విద్యుత్ కేంద్రం గరిష్ఠ ఉత్పత్తి

జలకళ సంతరించుకున్న సింగూర్ ప్రాజెక్టు(singoor hydro power project) తాగు, సాగునీటికి భరోసా కల్పించడంతోపాటు.. వెలుగులూ నింపుతోంది. జలశయానికి వరద ఉద్ధృతి అధికంగా ఉండటంతో విద్యుత్ ఉత్పత్తి(singoor power plant) జోరుగా సాగుతోంది. విద్యుత్ ఉత్పత్తి కేంద్రం స్థాపించిన నాటి నుంచి ఈ ఏడాది మూడో గరిష్ఠ ఉత్పత్తిని చేశారు. ప్రస్తుతం జలాశయం నిండుకుండలా ఉండటంతో.. ఉత్పత్తిల్లో కొత్త రికార్డులు సృష్టిస్తామని అధికారులు అంటున్నారు.

Singur Hydroelectric Generation Station
సింగూరు జల విద్యుత్‌ కేంద్రం

By

Published : Nov 24, 2021, 5:02 PM IST

మంజీరా నదిపై ఉన్న సింగూర్ జల విద్యుత్ కేంద్రం(Singoor Power project) మెతుకు సీమ వెలుగు రేఖగా మారింది. సింగూర్ ప్రాజెక్టుకు అనుబంధంగా 15 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి కేంద్రాన్ని నిర్మించారు. 7.5 మెగావాట్ల సామర్థ్యంతో రెండు యూనిట్లు ఉన్న ఈ కేంద్రంలో.. 1999నుంచి ఉత్పత్తి ప్రారంభమవగా... మరుసటి ఏడాది నుంచే రెండు యూనిట్లు అందుబాటులోకి వచ్చాయి. జలవిద్యుత్ ఉత్పత్తి కేంద్రం((singoor hydro power project)) లక్ష్యం కోటి యూనిట్లు కాగా.. ఈ ఆర్థిక ఏడాదిలో ఇప్పటికే కోటి 56లక్షల 21వేల యూనిట్లకు పైగా ఉత్పత్తి చేశారు. కేవలం 64 రోజుల్లోనే లక్ష్యాన్ని సాధించారు. ఈ కేంద్రంలో 2010-2011లో అత్యధికంగా 2కోట్ల 56 లక్షల 87 వేల యూనిట్ల విద్యుత్ ఉత్పత్తవగా.... 2000-2001లో 2 కోట్ల 19 లక్షల 73వేల యూనిట్లు ఉత్పత్తి చేశారు. కోటి 56 లక్షల 21 వేల యూనిట్లతో ప్రస్తుత ఏడాది మూడో అత్యధిక ఉత్పత్తి(new record in power generation at singur) స్థానంలో నిలిచింది. ఇందుకోసం 10.528 టీఎంసీల నీటిని ఉపయోగించుకున్నారు.

సాధారణంగా జలాశయం పూర్తి స్థాయి సామర్థ్యానికి చేరుకున్న తర్వాతే నీటి పారుదల శాఖ విద్యుత్ ఉత్పత్తికి అనుమతిస్తుంది. ఇక్కడ మాత్రం తక్కువ నీటి నిలువ ఉన్నా... ఉత్పత్తికి ఢోకా లేదు. దిగువన ఉన్న మంజీరా, ఘనాపురం, నిజాంసాగర్ జలాశయాలకు... సింగూరు నుంచి నీటి కేటాయింపు ఉంది. ఈ నీటిని జల విద్యుత్తు ఉత్పత్తి కేంద్రం ద్వారా విడుదల చేస్తూ.. లక్ష్యాన్ని చేరుకుంటున్నారు. సాగు, తాగునీటి అవసరాల కోసం ప్రాజెక్టు నుంచి దిగువకు వివిధ దఫాల్లో 6 టీఎసీంల నీటిని విడుదల చేయాల్సి ఉంది. దీనికి తోడు ప్రస్తుతం ప్రాజెక్టులో నీటి నిలువ పూర్తిస్థాయిలో ఉంది. ఒక టీఎంసీల నీటితో సుమారు 14లక్షల 80వేల యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. దిగువకు వదిలే నీటితో మరో 90 లక్షల యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేసి రికార్డులు తిరగరాస్తామని అధికారులు చెబుతున్నారు.

విద్యుత్ ఉత్పత్తి కేంద్రం నెలకొల్పిన 22 ఏళ్ల చరిత్రలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు, జలాశయంలో నీటి మట్టం డెడ్ స్టోరేజీకి పడిపోవడం వంటి కారణాలతో.. 2015-16, 2019-20 సంవత్సరాల్లో ఒక్క యూనిట్‌ విద్యుత్ కూడా ఉత్పత్తి చేయలేకపోయారు. ప్రస్తుతం గణనీయంగా విద్యుత్‌ ఉత్పత్తి చేస్తూ కొత్త రికార్డులను నెలకొల్పుతున్నారు.

సింగూరు జల విద్యుత్‌ కేంద్రం

ఇదీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details