సంగారెడ్డి జిల్లా బీరంగూడ గుట్టపై సుప్రసిద్ధ పురాతన పుణ్యక్షేత్రమైన శ్రీ భ్రమరాంబికా మల్లికార్జున స్వామి దేవాలయంలో శివరాత్రి ఉత్సవాలు ఐదు రోజుల పాటు అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. ఈ దేవాలయానికి జిల్లా నుంచే కాకుండా ఇటు జంటనగరాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు సందర్శిస్తుంటారు. ఈసారి దాదాపు మూడు లక్షల మందికి పైగా భక్తులు స్వామి వారిని దర్శించుకుంటారని అధికారులు అంచనా వేస్తున్నారు.
ఐదు రోజుల పాటు ఉత్సవాలు
శివరాత్రికి ఒకరోజు ముందు నుంచే ఈ ఆలయంలో ఉత్సవాలను ప్రారంభించారు. తొలిరోజు పుణ్యక్షేత్రంలో ఆలయ ప్రదక్షిణ, గోపూజ, కలశ పూజ గణపతి పూజ, స్వస్తి పుణ్యాహవచనం నిర్వహించారు. శివరాత్రి పర్వదినాన తెల్లవారుజామున మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం అనంతరం భక్తులకు దర్శించుకునే అవకాశం కల్పిస్తారు. అదేరోజు మహా మండపంలో రుద్రాభిషేకం అర్ధరాత్రి లింగోద్భవ సమయంలో అభిషేకం నిర్వహిస్తారు. 22వ తేదీ కళ్యాణోత్సవం సాయంత్రం రథోత్సవం జరగనుంది. మరుసటి రోజు వసంతోత్సవం నిర్వహించనున్నారు. చివరిరోజు రుద్రహోమం చేయనున్నారు. ఈ కార్యక్రమం ద్వారా దేవాలయంలో ఉత్సవాలు పరిసమాప్తమవుతాయి.
ఆలయానికి వచ్చే భక్తుల కోసం దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. భక్తులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా దారిపొడవున చలువ పందిళ్లు, నీటి సౌకర్యం, పార్కింగ్ కోసం ప్రత్యేక స్థలాలు ఏర్పాటు చేసినట్లు సిబ్బంది తెలిపారు.
శివరాత్రికి ముస్తాబైన బీరంగూడ శైవక్షేత్రం ఇవీ చూడండి:విలువలు, విశ్వసనీయతే మా బలం: ఈటీవీ భారత్ డైరెక్టర్ బృహతి