మహిళలు, యువతులను వేధిస్తున్న పోకిరీలపై సైబరాబాద్ షీ బృందాలు కొరడా ఝుళిపిస్తున్నారు. వేధిస్తూ పట్టుబడిన వారికి కౌన్సెలింగ్ ఇస్తున్నారు. అయినా వారి ప్రవర్తనలో మార్పు రాకపోతే కేసులు నమోదు చేసి కటకటాల వెనక్కి పంపుతున్నారు.
11 బృందాలు
మహిళలపై వేధింపులకు అడ్డుకట్ట వేయడానికి 11 షీ టీం బృందాలు సైబరాబాద్ పరిధిలో పనిచేస్తున్నాయి. ఈ నెలలో ఇప్పటి వరకు వేధింపులకు సంబంధించి 97 ఫిర్యాదులు పోలీసులకు వచ్చాయి. మహిళలను మోసం చేసి, వివాహం చేసుకోం అనే వేధింపులకు సంబంధించినవి- 13, సామాజిక మాధ్యమాల ద్వారా వేధింపులకు సంబంధించినవి- 4 కేసులు, అసభ్య ప్రవర్తనకు సంబంధించి ఒక ఫిర్యాదు అందాయని పోలీసులు వెల్లడించారు.
హెచ్చరికలు
వీటితో పాటు మరికొన్ని ఫిర్యాదులు వచ్చాయని పోలీసులు తెలిపారు. మొత్తం 12 కేసులు నమోదు చేయగా... వీటిలో 7 క్రిమినల్ కేసులు, 5 సాధారణ కేసులు కాగా.. 65 ఫిర్యాదుల్లో పోకిరీలను తమ ప్రవర్తన మార్చుకోవాలని హెచ్చరించినట్లు చెప్పారు. కమిషనరేట్ పరిధిలో మూడు బాల్య వివాహాలను అడ్డుకున్నట్లు వెల్లడించారు.