సంగారెడ్డికి చెందిన శాంతారావు విశ్రాంత ఉద్యోగి. తన 7 సంవత్సరాల వయస్సు నుంచే పోస్టల్ స్టాంపులు సేకరించారు. తన 20వ ఏట నుంచి కరెన్సీ సేకరణ ప్రారంభించారు. గత 47 సంవత్సరాలుగా తాను వివిధ కేటగిరీల్లో వేలాది బిళ్లలు, నోట్లు సేకరించారు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు... రిజర్వ్ బ్యాంకు గవర్నర్లు, ఆర్థిక కార్యదర్శులు సంతకాలున్న అన్ని నోట్లు ఉన్నాయి. 100, 200, 500, 1000 రూపాయల నాణేలు ఉన్నాయి. స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి ప్రభుత్వం విడుదల చేసిన అన్నీ రకాల నాణేలు, నోట్లు ఉన్నాయి.
10 కోట్ల నోటు..
మన కరెన్సీ మాత్రమే కాకుండా... 196దేశాలకు చెందిన కరెన్సీ శాంతారావు వద్ద ఉన్నాయి. ప్రపంచంలోనే అతి చిన్న, అతి పెద్ద నాణేలని కూడా సేకరించారు. 300 సంవత్సరాల క్రితం ఉపయోగించిన చెక్క నాణేలు... వివిధ దేశాలు ప్రత్యేక సందర్భలలో విడుదల చేసిన గాజు, ప్లాస్టిక్, వెండి, బంగారం లోహాలతో తయారు చేసిన బిళ్లలు... వివిధ భిన్న ఆకృతుల్లో రూపొందించిన నాణాలు సేకరించారు. యుగోస్లేవియా కరెన్సీలో పది కోట్ల విలువైన నోటు సైతం వీరి వద్ద ఉండటం విశేషం.
ఫస్ట్ డే కవర్లు..
వీరి వద్ద పది వేల రూపాయల నాణేలు, నోట్లు కూడా ఉన్నాయి. వీటిని ఇతర ప్రాంతాలకు వెళ్లినప్పుడు, వివిధ ఏజెన్సీల ద్వారా, మిత్రుల ద్వారా... ఆయా దేశాల ఎంబసీల ద్వారా సేకరించారు. శాంతారావు దగ్గర 50వేలపై చిలుకు పోస్టల్ స్టాంపులు ఉన్నాయి. మన దేశానికి చెందిన వాటితోపాటు... వివిధ దేశాలకు చెందినవి కూడా సేకరించారు. వీటిలో అయా ప్రత్యేక సందర్భాల్లో విడుదల చేసే స్టాంపులు... వాటికి అనుబంధంగా విడుదల చేసే ఫస్ట్ డే కవర్లు సైతం ఉండటం విశేషం. విభిన్న ఆకృతుల్లోని... ఒకే అంశానికి సంబంధించిన... వివిధ దేశాలు విడుదల చేసిన స్టాంపులు సేకరిస్తున్నారు.