విద్యార్థులుకు సైన్స్ సబ్జెక్టుల పట్ల రోజురోజుకూ భయం పెరుగుతోంది. ఫలితంగా సబ్జెక్టుల పట్ల నిరాసక్తి చూపిస్తున్నారు. ఈ విషయం గుర్తించిన సంగారెడ్డి జిల్లా విద్యాశాఖ అధికారులు... ఆరు సంవత్సరాల క్రితం జిల్లా సైన్స్ కేంద్రం పేరుతో ఓ ప్రయత్నం మొదలు పెట్టారు. ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు వారి పాఠ్యపుస్తకాల్లో ఉన్న వందలాది ప్రయోగాల నమూనాలు తయారు చేశారు. సైన్స్ కేంద్రానికి వచ్చిన విద్యార్థులే స్వయంగా ప్రయోగాలు చేసి అందులో విషయాలు తెలుసుకునేలా చర్యలు చేపట్టారు.
సైన్స్ సెంటర్ ప్రయత్నం సత్ఫలితాలివ్వడంతో మరో అడుగు వేశారు. సైన్స్ మ్యూజియం ఏర్పాటు చేశారు. వినోదంతో విజ్ఞానం పంచాలన్న ఉద్దేశంతో నిర్మించారు. బిర్లా సైన్స్ మ్యూజియం సహకారంతో రాష్ట్రంలోనే మొట్టమొదటి సైన్స్ మ్యూజియాన్ని సంగారెడ్డి పట్టణంలో నిర్మించారు. ఇందులో భౌతిక శాస్త్రం, జీవశాస్త్రం, అంతరిక్షం, గణితం, ఎలక్ట్రానిక్స్ కు సంబంధించిన ప్రధానమైన 58ప్రయోగాలు ఏర్పాటు చేశారు.
దేశవ్యాప్తంగా పదుల సంఖ్యలో సైన్స్ మ్యూజియాలు అందుబాటులో ఉన్నా.. అందులో గణిత విభాగం అరుదుగా కనిపిస్తాయి. కానీ, సంగారెడ్డిలో పది ప్రయోగాలతో వంద సిద్ధాంతాలను వివరించేలా ప్రత్యేకంగా గణిత విభాగం ఏర్పాటు చేశారు. ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు పాఠ్యపుస్తకాల్లో వచ్చే మొక్కలతో బోటానికల్ గార్డెన్ తీర్జిదిద్దారు. మ్యూజియంను సందర్శించిన తర్వాత విద్యార్థులు సైన్స్ కు సంబంధించిన విడియోలు చూడటానికి ప్రత్యేకంగా మిని థియేటర్ను రూపొందించారు.