అతడికి నా అనే వారెవరూ లేరు. ఆకలేస్తే అన్నం పెట్టే దిక్కు లేదు. నిద్రొస్తే పడుకోవడానికి కాసింత నీడ, గూడు కూడా లేదు. చెత్తకుండే అతడికి అన్నం పెట్టే అమ్మ. నిద్రొస్తే.. ఆ చెత్తకుప్పే అతడికి పూలపాన్పు. నిత్యం అతడిని చాలామంది చూసేవారు. కానీ.. ఎవరూ పట్టించుకునేవారు కాదు. కానీ.. సమాజ బాధ్యతను ఖాకీ చొక్క వేసుకొని మరీ కాపలా కాస్తున్న పోలీసులు చూస్తూ ఊరుకోలేదు. ఆ వృద్ధుడిని ఆస్పత్రికి తరలించారు. తగిన వైద్యం చేయించి అతడి బాగోగులు చూసుకుంటున్నారు.
చెత్త నుంచి ఆస్పత్రికి.. పోలీసుల మానవత్వం! - సంగారెడ్డి జిల్లా వార్తలు
దిక్కులేని వారిక దేవుడే దిక్కు అనే మాట నిత్యం ఏదో ఒక మూల నిజం అని నిరూపించబడుతూ ఉంటుంది. ఆ దేవుడి రూపంలో పోలీసులు చాలాసార్లు దిక్కులేని వారి పాలిట దిక్కై నిలిచారు. ఈ సారి సంగారెడ్డి పోలీసులు ఆ పాత్ర పోషించారు. మతిస్థిమితం సరిగ్గా లేని ఓ వృద్ధుడు నిత్యం చెత్తకుప్పలో పడుకోవడం గమనించిన సంగారెడ్డి పోలీసులు అతడిని సంగారెడ్డి ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
సంగారెడ్డి పట్టణంలోని పాత బస్టాండు సమీపంలోని ఓ రోడ్డు మధ్యలో చెత్త కూరుకుపోయింది. అందులోనే రోజూ ఓ వ్యక్తి పడుకునేవాడు. ఆ చెత్తలో ఏదైనా ఆహార పదార్థం దొరికితే అది తిని ఆకలి తీర్చుకునేవాడు. విసుగొచ్చినప్పుడు అలా తిరిగొచ్చి.. మళ్లీ ఆ చెత్తకుప్పలోనే కూర్చునేవాడు. ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో మామూలు మనుషులను ముట్టుకోవడానికే భయపడుతున్న తరుణంలో ఇలాంటి వ్యక్తులను ఎవరు పట్టించుకుంటారు. కానీ.. పోలీసులు అలా కాదు కదా! అందుకే.. ఆతడిని గమనించిన పోలీసులు ఆ వ్యక్తిని సంగారెడ్డి ప్రభుత్వాసుపత్రికి తరలించి వైద్యం చేయిస్తున్నారు. ఖాకీ చొక్కా మాటున అన్యాయాన్ని, అక్రమాన్ని తొక్కిపడేసే కర్కశత్వమే కాదు.. సాటి మనుషుల్ని కాపాడే మానవత్వం కూడా ఉంటుందని మరోసారి నిరూపించారు.
ఇదీ చదవండి:కరోనా పంజా: దేశంలో ఒక్కరోజే 90,632 కేసులు